Tuesday, November 26, 2024

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్… మళ్లీ ఉచిత బియ్యం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశాలతో నేటి నుంచి రాష్ట్రంలో మరో విడత ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్న‌ట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఒక‌ మనిషికి 10 కిలోల చొప్పున‌ ఉచిత బియ్యం పంపిణీ చేయ‌నున్న‌ట్లు ఇవాళ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 90.01 ల‌క్ష‌ల‌ కార్డులు, 283.42 లక్షల లబ్ధిదారులు ఉన్నార‌ని, వీరిలో కేంద్రం కేవలం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల మందికి మాత్రమే 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందని మంత్రి చెప్పారు. మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్న‌దన్నారు. కేంద్ర‌ ప్రభుత్వం మ‌రో మూడు నెలల కాలానికి పీఎంజీకేఏవై పథకాన్ని పొడిగించినందున‌.. రాష్ట్ర కార్డుదారుల కోసం ప్ర‌భుత్వం 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అద‌నంగా సేక‌రిస్తున్న‌ద‌ని మంత్రి గంగుల తెలిపారు. వీటికి నెలకు 75.75 కోట్ల చొప్పున మూడు నెలల్లో రాష్ట్రం అద‌నంగా 227.25 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పీఎంజీకేఏవై మొదలైనప్పటి నుంచి రాష్ట్ర స‌ర్కారు బియ్యం కోసం అద‌నంగా రూ.1308 కోట్లు ఖర్చు చేసింద‌ని మంత్రి తెలిపారు. ఇవిగాక వలస కూలీలకు రూ.500 చొప్పున‌, ప్రతి కార్డుకు రూ.1500 చొప్పున రెండు నెలలు అందజేసిన మొత్తం రూ.2,454 కోట్లు అయ్యింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement