Monday, November 25, 2024

TS | మధ్యాహ్న భోజన కార్మికులకు గుడ్‌ న్యూస్‌.. కనీస వేతనాలను పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. గతేడాది 2022 మార్చి 15న సీఎం కేసీఆర్‌ అసెంబ్లిలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.2000 పెంచుతున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు వారికి నెలకు రూ.వెయ్యి మాత్రమే వేతనాలుగా ప్రభుత్వం ఇచ్చేది.

అయితే పెంచిన వేతనానికి జీవో విడుదల చేసినప్పటికీ అది అములులోకి రాలేదు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు పలు రకాల ఉద్యమాలు చేపట్టారు. ఈనెల 10, 11, 12 తేదీల్లో కొన్ని జిల్లాల్లోని కార్మికులు ఏకంగా సమ్మె నోటీసులు ఇచ్చి పాఠశాలల్లో విద్యార్థుల కోసం వండే వంటను బంద్‌ పెట్టారు. దీంతో కొన్ని పాఠశాలల్లో టీచర్లే విద్యార్థులకు వండి భోజనాలు పెట్టాల్సి వచ్చింది. ఈక్రమంలో శనివారం నాడు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా విద్యాశాఖాధికారులతో ఈ అంశంతో పాటు పలు విద్యారంగ సమస్యలపైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు రూ.2వేలు పెంచుతున్నట్లు ప్రకటించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్‌-కమ్‌ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. పెంచిన వేతనాల వల్ల సంవత్సరానికి రూ.108.40 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు- చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారిగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు- కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తొలిమెట్టు-ను విజయవంతంగా అమలుచేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వార్షిక ప్రణాలికను విడుదల చేస్తున్నామని ఆమె తెలిపారు.

స్టేట్‌ లెవెల్‌ సర్వే…

పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్‌ లెవెల్‌ అచీవ్‌ మెంట్‌ సర్వేను నిర్వహించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో చర్యలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. పదవతరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని డీఈఓలను మంత్రి ఆదేశించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కోటి రూపాయల కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీ- (ఎస్‌.ఎం.సి)లకు అప్పగించి పనులను పూర్తి చేయాలన్నారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా వాటిని అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement