Tuesday, November 26, 2024

వైద్య విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, భారత్‌లో ఇంటర్న్‌ షిప్‌.. ప్రైవేటు వైద్య కళాశాల్లో ప్రవేశాలు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా.. అక్కడి వైద్య విద్యాభ్యాసాన్ని భారత్‌కు చేరుకుంటున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారంతా ఇక్కడే ఆయా కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని ఇంటర్న్‌షిప్‌ మధ్యలో ఉన్న, ప్రారంభించాల్సిన వైద్య విద్యార్థులకు భారత్‌లోనే ఆ అవకాశం కల్పించాలని జాతీయ వైద్య కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో వీరికి ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్‌ఎంసీ నిబంధనలు సడలించనుంది.

నిబంధనలు వర్తిస్తాయ్‌..

నిబంధనల ప్రకారం.. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారు అక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. భారత్‌లో వైద్యుడిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అనుమతించాలంటే.. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. యుద్ధంతో మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ తమ మిగిలిపోయిన ఇంటర్న్‌ షిప్‌ను ఇండియాలో పూర్తి చేయడానికి ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణులై ఉండాలని ఎన్‌ఎంసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2021 నవంబర్‌ 18కు ముందు వైద్య విద్య పట్టా పొందిన వారికి ఈ నిబంధనలు వర్తించవని ఎన్‌ఎంసీ పేర్కొంది.

విద్యార్థుల ఒత్తిడికి చెక్‌..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఆందోళనలో పడిపోయిన భారతీయ వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉండలేక.. భారత్‌కు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ పక్క చదువు పూర్తి కాకుండా వస్తే.. పరిస్థితి ఏంటి..? ఇంకో పక్క ఈ యుద్ధం ఎప్పటికి ఆగుతుంది..? తమ చదువు తిరిగి ఎప్పటికి కొనసాగుతుంది..? అసలు పూర్తి అవుతుందా..? లేకుండా తమ పరిస్థితి ఏంటి..? భవిష్యత్తు ఏంటి..? అనే ఆందోళనతో వెంటాడుతున్న వేళ అక్కడ ఉండలేక.. భారత్‌ తిరిగి రాలేక నానా కష్టాలు పడ్డారు. ఎలాగోలా కష్టపడుతూ.. ఆపరేషన్‌ గంగా పుణ్యమా అని భారత్‌లో అడుగుపెట్టారు. అయితే ఇంకా చాలా మందే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి ఉన్నారు.

- Advertisement -

ప్రభుత్వానికి తల్లిదండ్రుల కృతజ్ఞతలు..

జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చేసిన కీలక ప్రకటనతో.. అటు విద్యార్థులు.. ఇటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుతం ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమ పిల్లల చదువును దృష్టిలో పెట్టుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు. దీని కోసం ఎన్‌ఎంసీ తమ నిబంధనలు సవరించుకోవడం.. ఉత్తరులు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. మానవతా దృక్పథంతో కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధి.. ఆరేళ్లు. మరో రెండేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే.. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే ప్రతీ ఏటా వేలాది మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌ వెళ్తుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement