Tuesday, November 26, 2024

కొహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వందో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి..

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అభిమానులతోపాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. విరాట్‌ ఆడనున్న వందో టెస్టుకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. మార్చి 4నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో భారత్‌ రెండుటెస్టుల సిరీస్‌లోని తొలి టెస్టు ఆడనుంది. కోహ్లీ కెరీర్లో ఇది వందో టెస్టు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన కోహ్లీ టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. తొలుత ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావించారు. తాజాగా తొలి టెస్టు మ్యాచ్‌కు 50శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని పేర్కొంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా విరాట్‌ వైదొలిగిన నేపథ్యంలో అతడి కెరీర్లో 100వ టెస్టు చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. మరోవైపు బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కూడా ప్రేక్షకులను అనుమతిస్తున్నామని కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. కేసీఎ కార్యదర్శి ఈ విషయాన్ని తెలిపారు.

కాగా మార్చి 12నుంచి 16వరకు జరగనున్న బెంగళూరు టెస్టును డే అండ్‌ నైట్‌ టెస్టుగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం జరిగే మ్యాచ్‌ ప్రేక్షకులు సమక్షంలో జరగనుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ఓ ప్రకటనలో తెలపడంతో అభిమానులు నుంచి ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్‌లోని మొహాలీ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఈ విషయంపై చర్చించగా ప్రేక్షకులను అనుమతించేందుకు అంగీకరించినట్లు జైషా తెలిపారు.ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వైట్‌బాల్‌ సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన సంగతి తెలిసిందే. 50శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ ఆర్పీ సింగ్లా మంగళవారం మీడియాకు తెలిపారు. కాగా ఇప్పటివరకు 99టెస్టులు ఆడిన కోహ్లీ 50.39 సగటుతో 7962 పరుగులు సాధించాడు.

టీమిండియా నెట్‌ప్రాక్టీస్‌..

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ మరో రెండురోజుల్లో ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో భారతజట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో ఆటగాళ్లు సాధన చేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులకు షేర్‌ చేసింది. కాగా సెంచరీ చేయక రెండేళ్లు దాటిపోవడంతో కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. కోహ్లీకి మొహాలీ టెస్టు వందో టెస్టు కావడంతో ఆ టెస్టులోనైన కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీతోపాటు ప్రాక్టీస్‌ సెషన్‌లో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, యువ పేసర్‌ సిరాజ్‌, టీమిండియా రేసుగుర్రం.. వైస్‌ కెప్టెన్‌ బుమ్రా, గిల్‌, హనుమ విహారీ, కేఎస్‌ భరత్‌, ఉమేశ్‌ యాదవ్‌, కుల్దిప్‌ యాదవ్‌, మయాంక్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement