అమెరికాలో గ్రీన్ కార్డుల జారీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది భారతీయులకు గుడ్‌న్యూస్‌గానే చెప్పుకోవచ్చు. గ్రీన్ కార్డుల జారీపై ప్రస్తుతం ఉన్న పరిమితిలో మార్పులు చేసేందుకు నిర్ణయించింది. హెచ్1బీ, హెచ్4 వీసాల జారీ విషయంలో.. దేశాలను బట్టి పరిమిత సంఖ్యలో గ్రీన్ కార్డులను జారీ చేసే పద్ధతి (పర్ కంట్రీ క్యాప్)ను తొలగించాలని అమెరికా కాంగ్రెస్ కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం 7 శాతం ఉన్న దీన్ని 15 శాతానికి పెంచాలని కూడా సూచించింది. ఈగల్ యాక్ట్ పేరుతో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ బిల్లును 22-14 ఓట్లతో ఆమోదించింది. ఈ బిల్లు ఇక ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లో ఆమోదం లభించాల్సి ఉంది. ఆ తరువాత ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే చట్టరూపం దాల్చుతుంది. ఇదే జరిగితే.. అమెరికాలోని పని చేస్తున్న హెచ్1బీ వీసాదారులైన భారతీయులకు మేలు జరుగుతుంది.
అమెరికాలో ఉద్యోగుల కొరత..
అమెరికాలో ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో.. ఎలాంటి ప్రత్యేక అనుమతులు పొందకుండానే.. హెచ్ 4 వీసా ఉన్నవారికి ఉద్యోగం చేసే హక్కు కల్పించాలనేది అమెరికా చట్టసభ్యులు ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. అమెరికాలో నివాసం ఉంటున్న హెచ్4 వీసాదారులకు లబ్ది చేకూరుతుంది. హెచ్ 1బీ, హెచ్ 2ఏ, హెచ్ 2బీ, హెచ్3 వీసాలు ఉన్న వారి పిల్లలు, భాగస్వాములకు హెచ్4 వీసాను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. అమెరికాలో విద్యా సంస్థల్లో.. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య 12 శాతానికి పెరిగింది. చైనా నుంచి వచ్చే వారి సంఖ్య 8 శాతానికి పైగా తగ్గడం గమనార్హం. 2021లో 12,36,748 మంది ఎఫ్-1, ఎం1 వీసా విద్యార్థులు అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరినట్టు ఓ నివేదిక తెలిపింది. 2020తో పోలిస్తే.. 2021లో చైనా నుంచి 33,569 మంది విద్యార్థులు తక్కువగా వెళ్లారని చెప్పింది. భారత్ నుంచి మాత్రం 25,391 మంది పెరిగారని వివరించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వెళ్తున్న దేశాల్లో చైనా (3,48,992) టాప్‌లో ఉంది. ఆ తరువాత 2,32,851తో భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..