అమరావతి, ఆంధ్రప్రభ: నేతన్న నేస్తం కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఈనెల 20లోగా పూర్తి చేయాలని హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ విధివిధానాలు జారీచేశారు. గ్రామ, వార్డు సెక్రటరియేట్ల ద్వారా కొత్త లబ్దిదారులు, పాత లబ్ధిదారులు (ఇప్పటికే సహాయం పొందిన వారు) ధృవీకరణ ప్రక్రియ ఈనెల 21లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే రోజు ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి జిల్లాల వారీగా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, జనరేషన్ ఆఫ్ సోషల్ ఆడిట్ ప్రొవిజనల్‌కు పంపాల్సి ఉంటుంది. 28న సెక్రటరీ స్థాయిలో జాబితా ప్రచురించనున్నారు.
30న దరఖాస్తుల ఎంపికపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదులను స్వీకరిస్తారు. అర్హుల తుది జాబితాను జులై ఆరోతేదీన తయారు చేయనున్నారు. జిల్లా కలెక్టర్, డిఎల్‌సి ద్వారా జులై 8వ తేదీన తుది జాబితాను ఆమోదించనున్నారు. అనంతరం సిఎం ఆదేశాల మేరకు నిధులు విడుదల అవుతాయని అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదిలా వుండగా వరుసగా ఐదో ఏడాదీ నేతన్న కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 80,546 మంది నేతన్నలకు 4వ విడతగా 193.31 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేసారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటు-ంబానికి ఏడాదికి 24,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందచేస్తోంది. ఐదో విడత అందిస్తున్న సాయంతో కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు అందించిన మొత్తం సాయం 1.2 లక్షలు కానుంది.