లాక్‌డౌన్ కారణంగా డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో తమ యూజర్లకు గూగుల్ పే శుభవార్త చెప్పింది. ఈ యాప్ వినియోగదారులు ఇక నుంచి అమెరికా నుంచి భారత్, సింగపూర్ యూజర్లకు డబ్బులు పంపే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు యూజర్లకు ఈ సదుపాయాలు కల్పించేందుకు గూగుల్ పే ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్, వైజ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్‌తో నగదు బదిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇకపై అమెరికా యూజర్లు మరో 200 దేశాలకు, వైజ్ ద్వారా 80 దేశాలకు డబ్బు పంపుకునే సౌకర్యాలు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పే వెల్లడించింది.
ఈ సదుపాయాలు వ్యక్తిగత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, బిజినెస్ అకౌంట్లకు ఈ సౌకర్యం ఉండబోదని స్పష్టంచేసింది. ఇటీవలి కాలంలో నగదు బదిలీల కోసం భారత్‌లో గూగుల్ పేను కోట్లాది మంది వాడుతున్నారు. అయితే వినియోగదారులు అమెరికా నుంచి భారత్‌లో ఉన్న వారికి నగదును ట్రాన్స్‌ఫర్ చేసినందుకు గల రుసుం వివరాలను వెల్లడించాల్సిఉంది. అయితే గూగుల్ పే సేవలను ఇన్నాళ్లు ఏ దేశంలోని వారు.. ఆయా ప్రాంతాల్లోనే వినియోగించుకునే వారు. గూగుల్ పే తాజా వెసులుబాటు వల్ల చాలామంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.