అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు పదిహేడేళ్ల తరువాత ఏపీ ట్రాన్సకో, ఏపీ జెన్‌కోతో పాటు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలోని ఉద్యోగులు ఒక సంస్థనుండి మరో సంస్థకు బదిలీ అయ్యే వెసులుబాటు కల్పించింది. 2005లో ఈ రతహా బదిలీలపై బ్యాన్ విధించడంతో ఇన్నాళ్లూ ఏ సంస్థ పరిధిలోని వారు ఆ సంస్థ పరిధిలోనే బదిలీ అవుతున్నారు. అంటే ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగి ఆ సంస్ధ పరిధిలోని జిల్లాల్లోనే బదిలీ అవుతారు. తాజా వెసులుబాటుతో ఆ సంస్థ ఉద్యోగి ఎపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని జిల్లాలకు బదిలీని కోరవచ్చు.
ఈ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో హెచ్‌ఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఛైర్మన్‌గా ఓ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 12లోగా సిబ్బంది తమ బదిలీ అభ్యర్ధన దరఖాస్తులను హెచ్‌ఆర్ కమిటీకి అందించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అనంతరం ఉద్యోగుల బదిలీలు జరుగుతాయి.