హైదరాబాద్, ఆంధ్రప్రభ : రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మరోమారు వాయిదాపడింది. కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శి క్షణ శాఖ (డీఓపీటీ) తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనపై హైకోర్టు విచారణను జూలై 3 కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభినందన్ కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం కేంద్ర సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డీఓపీటీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించింది. తమకు కేటాయించిన రాష్ట్రాలలో విధులలో చేరకుండా సివిల్ సర్విసెస్ అధికారులు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్‌లో జరిగిన విచారణ అనంతరం 2016 లో అధికారులకు అనుకూలంగా తీర్పువచ్చింది. క్యాట్ ఉత్తర్వుల మేరకు ఏపీ కేడర్‌కు చెందిన 6 మంది ఐఎఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు తెలంగాణలో కొనసాగుతున్నారు.
అదే విధంగా తెలంగాణకు కేటాయించిన అధికారులు కొందరు ఏపీలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీఓపీటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్ కేటాయింపుపై జరిగిన విచారణ సందర్భంగా ఆయన్ను వెంటనే ఏపీలో చేరాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు మేరకు సోమేష్కుమర్ ఆంధ్ర్రప్రదేశ్ కేడర్‌లో చేరారు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన కేసు విచారణ సందర్భంగా మరి కొందరు కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులకు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
తిరిగి సోమవారం డీజీపీ అంజనీకుమార్, సి హరికిరణ్, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి మల్లెల ప్రశాంతి, సి హరికిరణ్, విద్యాశాఖ కార్యదర్సి వాకాటి కరుణ, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ ఎ వాణిప్రసాద్, గుమ్మల్ల శ్రీజన, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న కె ఆమ్రపాలి, ఏపీ కేడర్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు జి అనంతరాము, ఎస్ఎస్ రావత్, ఎల్ శివశంకర్, ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ల పిటిషన్లపై హైకోర్టు విచారించింది. విచారణ సందర్బంగా క్యాట్ న్యాయవాది వాదనలు వినిపించేందుకు తమకు నెలరోజుల గడువు కావాలని అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది.తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఇద్దరు ఐపీఎస్ అధికారులు రంగనాథ్ , సంతోష్ మెహ్రా మధ్యలోనే తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.