హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంగన్‌వాడీలకు సర్కార్ దసరా కానుక అందించింది. పీఆర్సితోపాటు, పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్ణయిస్తూ సర్కార్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అంగన్‌వాడీల సమస్యల పట్ల సానుకూల ధృక్పధంతో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గత కొతం కాలంగా తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్‌వాడీలను చేర్చాలని సర్కారు నిర్ణయించింది.
ఈ మేరకు తన నివాసానికి వచ్చిన అంగన్‌వాడీ హెల్పర్స్ యాక్షన్ కమిటీ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులకు మంత్రి హరీశ్‌రావు ఆయా సర్కార్ నిర్ణయాలను వివరించారు. మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసినట్టు ప్రకటించారు. అంగన్‌వాడీల ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై తొందరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల 70 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అంగన్‌వాడీల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. ఆదివారంనాడు మంత్రులు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో అంగన్‌వాడీ హెల్పర్స్, టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 70వేల మంది అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. టీచర్లు, హెల్పసర్లు ఈ నిర్ణయంతో లబ్ది పొందనున్నారు. వారి జీతాల పెంపు విషయంలో భద్రత లభించనున్నది. ప్రతీసారి వారు జీతాల పెంపునకు ప్రభుత్వాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది.
పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలు పెంచిన ప్రతీసారి వారి వేతనాలు అదే క్రమంలో పెరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ మానవతా దృక్పదంతో మూడుసార్లు అంగన్‌వాడీల వేతనాలను పెంచారు. అంగన్‌వాడీఅల మిగిలిన డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వీటి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.
గతంలో పలు వరాలు…
గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, హెల్పర్లకు పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచూతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అదేవిధంగా 3989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా స్థాయిని పెంచింది.
బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్ర వాటా 90శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10శాతంగా ఉండేది. తాజాగా మోడీ సర్కార్ ఈ వాటాను 90నుంచి 60శాతానికి తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాను 10శాతంనుంచి 40శాతానికి పెంచింది.
రాష్ట్రంలో 35700 అంగన్‌వాడీలుండగా, ప్రధాన అంగన్‌వాడీలు 31711, మినీ అంగన్‌వాడీలు 3989 ఉన్నాయి. వీటన్నింటినీ ప్రధాన అంగన్‌వాడీలుగా తెలంగాణ సర్కార్ మార్చింది. స్థాయిని పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 149, గ్రామీణంలో 99, పట్టణాల్లో 25, గిరిజన ప్రాంతాల్లో మరో 25 ఉన్నాయి.