అమోరికాకు చెందిన ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్‌ను దీర్ఘకాలం ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచవచ్చని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ప్రకటించింది. కరోనా వైరస్‌ను అత్యంత సమర్థంగా ఎదుర్కొంటున్న వ్యాక్సిన్లలో ఫైజర్ ముందు వరసలో ఉంది. భారత్‌లో తాజాగా వెలుగు చూసిన కొత్త వేరియంట్లపై కూడా ఫైజర్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని ఓ సర్వేలో తేలింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్‌ను రవాణా చేయడం తీవ్ర ఇబ్బందితో కూడిన వ్యవహారం కావడం ఇప్పటివరకు ప్రతికూలంగా నిలిచింది.
ఫైజర్ వ్యాక్సిన్లను నిల్వ చేయాలంటే మైనస్ 80 నుంచి మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. ఆ స్థాయి శీతలీకరణ వ్యవస్థ భారత్‌లో లేదు. దీంతో ఈ వ్యాక్సిన్‌పై భారత్, కొన్ని ఐరోపా దేశాలు ఆసక్తి చూపలేదు. తాజాగా ఈ వ్యాక్సిన్ నిల్వ చేసే ఉష్ణోగ్రతను మైనస్ 15 నుంచి మైనస్ 25 డిగ్రీలకు ఫైజర్ సంస్థ పెంచింది. అంతేకాదు ఒకసారి శీతలీకరణ వ్యవస్థ నుంచి బయటకు తీసిన తర్వాత ఫ్రిజ్‌లో నెల రోజుల వరకు నిల్వ ఉంచవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ఈ పరిమితి ఐదు రోజుల వరకే ఉండేది. తాజా ప్రకటన నేపథ్యంలో పలు దేశాలు ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ఫైజర్ టీకాలను 12 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇచ్చేందుకు కెనడా ఆమోదించిన సంగతి తెలిసిందే.