Saturday, November 23, 2024

భారత్‌కు మంచిరోజులు.. విదేశీ యాత్రికుల సంఖ్య రెట్టింపు

భారత్‌ పర్యాటక రంగానికి మంచిరోజులు వచ్చాయి. కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు కుదేలైన పర్యాటకం రంగం ఇప్పుడు కళకళలాడుతోంది. విదేశాలనుంచి వచ్చే, మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుందని తాజా అధ్యయనం అంచనావేసింది. ప్రత్యేకించి 2024నాటికి భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం 42 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. పర్యాటకులను ఆకర్షించేందుకు విధానపరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఔట్‌బౌండ్‌ ట్రావెల్‌ – టూరిజం ఏన్‌ ఆపర్చ్యూనిటీ అన్‌టాప్‌డ్‌ అనే అంశంపై నాంగియా అండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ, ఫిక్కీతో కలసి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. ఈ పరిణామాన్ని అవకాశాలుగా మలుచుకోవాలని భారతీయ పర్యాటక, యాత్రా నిర్వహణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచంలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలకు నేరుగా టూర్లు నిర్వహించేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు భారత్‌లోని బడా టూరిస్టు సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.

భారత్‌కు సువర్ణావకాశం..

భారత సముద్ర జలాల్లో విదేశాలకు చెందిన క్రూయిజ్‌ షిప్‌లను నడపడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. నాంగియా అండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ సారథి, ప్రభుత్వ, పబ్లిక్‌ సెక్టార్‌ సలహాదారు సూరజ్‌ నాంగియా అంచనా ప్రకారం 2024 నాటికి భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల ద్వారా జరిగే వ్యాపారం 42 బిలియన్‌ డాలర్ల మేర ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ పర్యాటక రంగంలో భారత్‌ కీలకంగా మారబోతోందని ఆయన అంచనా వేశారు. ఏటా 8 కోట్ల మంది పర్యాటక వీసాలు పొందుతున్నారని, ప్రత్యేకించి మధ్యతరగతివారిలో పర్యాటకంపై ఆసక్తి పెరిగిందని చెప్పారు. భారత్‌లోకి విదేశీ పర్యాటక నావలను అనుమతించడం వల్ల ప్రభుత్వానికి (భారతీయ పోర్టులకు) ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. మనదేశంలో యువత ఎక్కువగా ఉండటం, ఆర్థికరంగం కోలుకోవడం, మధ్యతరగతి పుంజుకోవడంవల్ల విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోందని అన్నారు. భారత్‌నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల్లో 20 శాతం మంది యూరోప్‌కు వెళుతున్నారని, పది శాతం మంది ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌కు, మిగతావారు ఆగ్నేయాసియా దేశాలకు వెడుతున్నారని చెప్పారు.

పర్యాటక వ్యాపారంలో ప్రగతి..

విదేశాల్లో విహారయాత్రలు, పర్యాటకానికి భారతీయ పర్యాటకులు 2021లో వెచ్చించిన మొత్తం 12.6 బిలియన్‌ డాలర్లు. కోవిడ్‌ రావడం వల్ల విదేశాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2020లో పర్యాటకులు వెచ్చించిన మొత్తం 22.9 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావం దాదాపు లేదు. ఈ నేపథ్యంలో విదేశాలు వెళ్లే భారతీయ పర్యాటకులు దాదాపు 42 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఖర్చుపెట్టేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement