Sunday, November 24, 2024

Delhi | ఐదు సార్లు ఓడినోళ్లు గొప్ప నేతలా? కాంగ్రెస్ అధిష్టానానికి గోనె లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో ఐదు పర్యాయాలు ఓడిపోయిన నేతలు, తమ జిల్లాలో తామున్న పార్టీలో ఒక్క సీటు తప్ప మిగతా సీట్లను గెలిపించలేకపోయిన నేతలు గొప్ప నేతలు ఎలా అయ్యారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు రాసిన లేఖలను మీడియాకు విడుదల చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు, బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీకి సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని అన్నారు. టికెట్ల కేటాయింపులో ఈ మూడు వర్గాలకు అన్యాయం జరిగిందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాష్యూట్ నేతలకే ప్రాధాన్యత దక్కిందని అన్నారు.

తొలి జాబితాలోనే 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టికెట్ల కేటాయింపును మ్యానిప్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు. సర్వే రిపోర్టులు అంటూ తన వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అశాస్త్రీయమైన, పక్షపాతంతో కూడిన సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తున్నారని గోనె ప్రకాశరావు మండిపడ్డారు.

కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా ఎన్నో త్యాగాలు చేస్తూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన విధేయులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. సీట్లు అమ్ముకుంటున్నారని తాను అనడం లేదని, కానీ సీట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొందని అన్నారు. సీట్ల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

అనేక పర్యాయాలు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ సీటు ఇస్తుందని, బీఆర్ఎస్ పార్టీలో గెలవలేకపోయిన తుమ్మల, పొంగులేటి కాంగ్రెస్‌లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని గోనె ఆరోపించారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే కనుచూపు మేరలో కాంగ్రెస్ కనపడదని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement