న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో కొన్ని విషయాలు దాచిపెట్టి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు. ఇవ్వాల (మంగళవారం) ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశం విజయ రమణారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రమణారావుకు రెండు పాన్ కార్డులు ఉన్నాయని, గత ఎన్నికల్లో ఒక పాన్‌కార్డు నెంబర్ తనదిగా చూపిన ఆయన ఈసారి ఎన్నికల్లో మరో నెంబర్ తనదిగా చూపారని అన్నారు.
ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ), కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆర్థిక శాఖ సహా పలు ఏజెన్సీలకు ఫిర్యాదు చేశానని గోనె తెలిపారు. విజయ రమణారావు తప్పులు తేలితే ఆరేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, అందుకే పెద్దపల్లి ప్రజలు ఆయనకు ఓటేస్తే ఆ ఓటు వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని మోసగిస్తూ వచ్చారని ఆరోపించారు. ఆయనకు హాంకాంగ్‌లో కూడా ఆస్తులు ఉన్నాయని, అక్కడి బ్యాంకుల్లో పెద్ద ఎత్తున నగగదు జమ చేశారని అన్నారు.
ఈ చర్యలు ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలేనని, వీటిపై ఈడీ చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని, జైలుకు కూడా వెళ్తారని గోనె ప్రకాష్ అన్నారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత అక్కడి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. విజయ రమణారావుకి వ్యతిరేకంగా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయాల్సిన అవసరం తనకు లేదని, తనను మోసగించి ఇబ్బంది పెట్టినందుకే ఆయన తప్పుల గురించి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని అన్నారు.