ముంబై : దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. టమాటా ను సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. రూ.150కు తగ్గనంటున్నది.. మరికొన్ని ప్రాంతాలలో రెండు వందలు దాటేసింది.. ఈ ధరలు పుణ్యామా అని టమాటా రైతులు మాత్రం భారీ లాభాలు గడించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరడంతో ఆ రైతులు సంతోషంగా ఉన్నారు.
మహారాష్ట్ర పుణె జిల్లాలోని తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు 13 వేల క్రేట్ల టమాటాలను నెల రోజుల్లో అమ్మేశాడు. ఇందుకు గానూ రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. తుకారానికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా, 12 ఎకరాల్లో టమాటా పంటను పండించాడు. ఈ పంటను పండించేందుకు తన కుటుంబం మొత్తం కష్టపడిందని తుకారాం తెలిపాడు. ఇక టమాటా పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ వాడినట్లు పేర్కొన్నాడు.
ఇక శుక్రవారం ఒక్కరోజే 900 క్రేట్ల టమాటాలు విక్రయించి రూ. 18 లక్షలు సంపాదించాడు. ఇలా పుణెలోని చాలా మంది టమాటా రైతులు కోటీశ్వర్లుగా మారారు. మొత్తంగా పుణెలో ఒక్క నెలలోనే రూ. 80 కోట్ల విలువ చేసే టమాటా విక్రయాలు జరిగాయని రైతుల కమిటీ తెలిపింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే 100 మంది మహిళలకు పైగా ఉపాధి లభించింది.