Monday, November 25, 2024

ఏయిర్‌ పోర్టులో పట్టుబడిన బంగారం.. 2.9 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: బంగారం స్మగ్లర్లు అనుమానం రాకుండా అనేకవిధాలుగా ప్రయత్నిస్తున్నా కస్టమ్స్‌ అధికారుల నిఘానేత్రాల నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ప్రధానంగా దుబాయ్‌ లో బంగారం తక్కువ ధరకు లభించడం, భారతీయ మార్కెట్‌ లో అధికధరలు ఉండటంతో స్మగ్లర్లు బంగారంపై దృష్టి సారించారు. దుబాయ్‌ నుంచి వచ్చే విమానాల్లో తరుచుగా బంగారం స్మగ్లింగ్‌ అవుతుండటాన్ని సవాల్‌ గాతీసుకున్న కస్టమ్స్‌ అధికారు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు పట్టుబడటం నిత్యకృత్యంగా మారింది. శనివారం తెల్లవారు జామున శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఏయిర్‌ పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది.

ఎఫ్‌జెడ్‌ 461 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీచేయగా అనుమానిత బ్యాగ్‌ అగుపించింది. క్షుణ్ణంగా అధికారులు పరిశీలించగా బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. దొరికిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనంచేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుని దగ్గర నుంచి కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న బ్యాగ్‌ లో 24 క్యారెట్‌ బంగారం బిస్కెట్లు, 1414 గ్రాముల బరువుగల 18 క్యారెట్‌ బంగారం ఆభరణాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 1.38 కోట్ల ఉంటుందని అధికారులు అంచనావేశారు.

ఆభరణాలు, బిస్కెట్‌ తో కలిపి 2961 గ్రాముల బంగారంగా అధికారులు లెక్కగట్టారు. ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌ నుంచి దొంగచాటుగా భారత్‌ లోకి బంగారుబిస్కెట్లు, ఆభరణాలు ఎవరికి చేరవేసేందుకు స్మగ్లింగ్‌ చేస్తున్నావని కస్టమ్స్‌ అధికారులు నిందితున్ని ప్రశ్నించారు. అయితే అనేక కోణాల్లోంచి కస్టమ్స్‌ అధికారులు ప్రశ్నించిన అనంతరం కేసు నమోదుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement