Tuesday, November 19, 2024

Followup | సినీ ఫక్కీలో బంగారం దోపిడీ.. అధికారుల్లా వచ్చి తనిఖీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : సినీ పక్కీని తలపించే విధంగా సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలు, నడిరోడ్డు మీద ఉన్న బంగారం షాపులో సిబ్బంది కళ్ల ముందే 1.7 కిలోల బంగారం దోచుకెళ్లారు. మహానగరం నడిబొడ్డున ఉన్న ఓ బంగారం నగల దుకాణాన్ని అప్పుడే తెరిచారు. ఒక్కొక్కరుగా కస్టమర్లు వస్తున్నారు. అదే సమయంలో కొంతమంది సూటు బూటు వేసుకుని ఆఫీసర్లలా కనిపిస్తున్న వారు షాపులోకి వచ్చారు. రాగానే హడావుడిగా.. గోల్డ్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి.. షాపంతా చెక్‌ చేయాలంటూ సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు. ఏదో తనిఖీ చేస్తున్నట్టు హంగామా చేశారు. కాసేపటి తర్వాత 1.7 కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్‌ కట్టలేదనే సాకు చూపుతూ ఈ గోల్డ్‌ సీజ్‌ చేస్తున్నామని చెప్పి ఆ బంగారం తీసుకుని ఎలాంటి నోటీ-సు ఇవ్వకుండా అక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా చూస్తుంటే ఏదో సినిమాలో సీన్‌ చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా.

- Advertisement -

హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణంలో ఇవాళ ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. ఆ షాపు యజమాని ఊళ్లో లేకపోవడంతో సిబ్బంది అతడికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న షాపు ఓనర్‌ ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి గోల్డ్‌ సీజ్‌ చేసిన సంగతి చెప్పాడు. అయితే వారు.. ఐటీ అధికారులు అలా వచ్చి తనిఖీలు చేయరని.. ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు యజమాని. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు చూసి.. ఆ ఐదుగురు వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులను తేల్చారు.

ఐటీ అధికారుల్లాగా నటించి బంగారం కొట్టేశారని ధ్రువీకరించారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆరుగురికి ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. నిందితులను పట్టు కోవడానికి స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామని.. వీలైనంత త్వరగా ఈ నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement