Tuesday, November 26, 2024

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి పొదుపుగా, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం ఉపయోగపడుతుంది. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు, పండగల సమయాల్లో బంగారాన్ని కొని దాచుకుంటుంటారు. మహిళలు ముఖ్యంగా అలంకరణకు బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. అయితే ఇప్పుడు వారికి నిరాశే మిగిలింది. బంగారం, వెండి ఇప్పుడు కొనాలంటే చాలా కష్టంగా మారింది. రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా మరోసారి రేట్లు పెరిగి భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర తాజాగా రూ.190 పెరిగి రూ.52,200 కు చేరింది. దీంతో గత 10 రోజుల్లోనే ఏకంగా రూ.1000 మేర పెరిగింది. ఇక గత నెల కనిష్టం నుంచి చూసుకుంటే ఏకంగా రూ.3,450 మేర పెరగడం గమనార్హం. డిసెంబర్ నెలలో ఒకటో తేదీన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.48,750 వద్ద ఉండేది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.210 పెరిగి తులానికి రూ.56,950 కి చేరింది. దేశ రాజధానిలో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.190 పెరిగి రూ.52,350 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర దిల్లీలో రూ.110 పెరిగి రూ.57,100 మార్కుకు చేరింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఆకాశాన్నంటున్నాయి. ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి రేటు రూ.150 మేర పెరగ్గా.. రూ.72,900కు చేరింది. ఇక హైదరాబాద్‌లో ఒక్కరోజే సిల్వర్ ధర ఏకంగా రూ.1800 మేర పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,800 కు చేరింది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం కావడం విశేషం. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement