వెంకటాపూర్, ప్రభన్యూస్: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుతో రామప్ప దేవాలయం అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. రామప్ప పరిసరాలలోని ఉపాలయాలు మాత్రం గోల్డ్ హంట్‌కు ధ్వంసమయిపోతున్నాయి. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న గుప్తనిధుల ముఠాలు దీప దూప నైవేద్యానికి నోచుకోని ఆలయాలే లక్ష్యంగా తవ్వకాలు జరుపుతున్నాయి. కాకతీయుల కాలం నాటి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అపురూప శిల్ప సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తున్న పురావస్తు శాఖ చోద్యం చూస్తోంది. దీంతో అరుదైన శిల్ప సంపద భూమిలో కలిసిపోతోంది.
ఉపాలయాలే టార్గెట్
రామప్ప దేవాలయాన్ని ఆనుకుని ఉన్న కాటేశ్వరాలయం, విప్పి కుప్పపెట్టిన కామేశ్వరాలయం, పక్కనే ఉన్న చిన్న ఆలయాల్లో గతంలో గుప్తనిధుల ముఠాలు తవ్వకాలు జరిపే ప్రయత్నం చేశాయి. యునెస్కో గుర్తింపుతో ప్రస్తుతం అభివృద్ధి పనులు చేయడం కోసం అధికారులు నడుం బిగించడంతో కొన్ని ఆలయాలు గుప్త నిధుల వేట నుండి తప్పించుకున్నాయి. రానున్న రోజుల్లో రామప్ప చుట్టూ ఉన్న సుమారు 16 ఉపాలయాలను కూడా అభివృద్ధి చేస్తే మళ్లీ తవ్వకాలు జరిపే అవకాశాలు దొరకవని గ్రహించిన గోల్డ్ హంటర్స్ ఒక్కో ఆలయాన్ని టార్గెట్ చేస్తూ తవ్వకాలు జరుపుతుండడంతో పాలంపేట గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు ఆలయాల్లోని శివలింగాలను సైతం పూర్తిగా తవ్వేసి బయటపడేశారు. బంగారం దొరుకుతుందనే ఆశతో భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన ఆలయ సంపదను ధ్వంసం చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో గుప్త నిధుల ముఠాలు చెలరేగిపోతున్నాయి.
ఆలయాలను రక్షించేదెవరు?
రామప్ప సరస్సు కట్టపై ఉన్న ప్రతి ఆలయం గుప్తనిధుల తవ్వకాలతో ధ్వంసమై ఉంది. సరస్సుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న రెండు చిన్న ఆలయాలలో ఈమధ్య ప్రతి రోజు తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రతి చోట జోరుగా గుప్తనిధుల ముఠాలు పొక్కిలి చేస్తున్నాయి. పాలంపేట గ్రామంలోని నివాస ప్రాంతాల్లోనూ విగ్రహాలు బయల్పడిన చోట గుప్త నిధుల ముఠాలు రాత్రి వేళల్లో తవ్వకాలు జరుపుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి-కై-నా పురావస్తు శాఖ, పోలీసు అధికారులు గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాలపై నిఘా పెట్టి విలువైన శిల్ప సంపదను కాపాడుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.