దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ పైలట్లను నిలుపుకునేందుకు వారికి అదనంగా నెలకు లక్ష రూపాయల వేతనాన్ని ఆఫర్ చేసింది. ఫస్ట్ ఆఫీసర్స్‌కు నెలకు అదనంగా 50 వేల రూపాయల ఆఫర్ ఇచ్చింది. నెలవారి వారికి చెల్లిస్తున్న వేతనానికి ఇది అదనం. పెంచిన వేతనాలు జూన్ 1 నుంచి అమలు చేస్తామని సంస్థ పైలట్స్‌కు పంపించిన ఈ మెయిల్‌లో తెలిపింది. సంస్థ నుంచి బయటకు వెళ్లిన పైలట్లు జూన్ 15 లోగా రాజీనామానాలు ఉపసంహరించుకున్న వారికి కూడా ఈవేతనాలు వర్తింప చేస్తామని తెలిపింది. సంస్థలో ఎక్కువ కాలం పని చేస్తున్న వారికి లాంగ్‌విటీ బోనస్‌ను కూడా త్వరలో పునరుద్ధరిస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం గోఫస్ట్ పైలట్స్‌కు నెలకు 5,30,000 రూపాయల వేతనం అందుతోంది. స్పైస్ జెట్ విమాన పైలట్లకు ఆ సంస్థ నెలకు 7,50,000 రూపాయల వేతనం ఇస్తోంది. ఇటీవల సంస్థ రెండు సార్లు వేతనాలను పెంచింది. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గోఫస్ట్‌కు పునరుద్ధరణ ప్రణాళిక సమర్పించేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్లాన్‌లో సంస్థ వద్ద ఎంత మంది పైలట్లు, సిబ్బంది ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియచేయాల్సి ఉంటుంది. విమాన సర్వీస్‌లు నడపకపోవడంతో చాలా మంది పైలట్లు ఇతర సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన గో ఫస్ట్ వారిని నిలబెట్టుకునేందుకు అదనపు వేతనాన్ని ఆఫర్ చేసింది.
మన దేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎయిర్‌లైన్స్ సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇండిగో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 5 వేల మంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా ఈ సంవత్సరం ఇప్పటికే 4,200 మంది క్యాబిన్ క్రూను, 900 మంది పైలట్స్‌ను నియమించింది.