Monday, November 25, 2024

గోద్రా రైలు దగ్దం కేసు.. 8 మంది దోషులకు సుప్రీం కోర్టు బెయిల్‌

2002లో గుజరాత్‌లోని గోద్రాలో రైలు దగ్దం కేసుకు సంబంధించి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. కేసులో మరో నలుగురు దోషుల పాత్రను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ కోసం వారు చేసుకున్న దరఖాస్తును తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైలు దగ్దం కేసులో ఎనిమిది దోషుల పాత్రతోపాటుగా వారు ఇప్పటికే 17 నుంచి 18 సంవత్సరాలు కారాగారవాసంలో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

మిగిలిన నలుగురు దోషులు బెయిల్‌ కోసం చేసుకున్న దరఖాస్తును తోసిపుచ్చిన సందర్భంగా ”ఆ నలుగురి పాత్రలపై నా వద్ద కొన్ని అంశాలు ఉన్నాయి” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ ఆ నలుగురు దోషులకు ఏ విధమైన ఊరటను తాను వ్యతిరేకిస్తున్నట్టు ధర్మాసనానికి విన్నవించుకున్నారు. అంతకు మునుపు గోద్రా రైలు దగ్దం కేసులో బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను గుజరాత్‌ ప్రభుత్వం వ్యతిరేకించింది. నేర తీవ్రతను గమనంలోకి తీసుకొని, కేసున అత్యంత అరుదైన కేసుల్లో ఒకటిగా పరిగిణించి దోషులకు ఎలాంటి ఊరటను కల్పించరాదని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement