హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో:
కాలం కనికరించదు.. పాలకులు పట్టించుకోరు.. అదే అదనుగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం.. ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. గడిచిన యాభై యేళ్ళ కాలంగా ఏలిన, మారిపోయిన ప్రభుత్వాలు, నాటి పాలకులైన నాయకులు చేసిన పాపాలు నేటికీ వెంటాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతియేటా ముప్పే.. ప్రకృతి ప్రకోపానికి వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు అస్తిరత్వంలో బతకాల్సిన దుస్థితి. ప్రజల చర, స్థిరాస్తులకు అంచనాకు మించి నష్టం వాటిల్లుతున్నా, ప్రతియేటా ముప్పు తీవ్రత పెరుగుతున్నా.. సమస్యలు జటిలమవుతున్నా.. స్పందించిన దాఖలాలు లేవు. గత ఏడాది.. అంతకు ముందు ఏడాది.. ఈ ఏడాది.. తీవ్రతలో హెచ్చుతగ్గులున్నా, గోదావరి గట్టునున్న గ్రామాలను వరద ముప్పు ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఎగువన కురిసిన అతిభారీ వర్షాలు, ఉవ్వెత్తున ఎగిసిపడే వరదలు, తెగిపోయే చెరువుగట్లు, వంతెనలు దూకే సెలయేర్లు.. ఇదంతా అక్కడి ప్రజలకు నిత్యకృత్యమే. కానీ, ఊహించని విధంగా సంభవించే అతివృష్టి, ఉవ్వెత్తున ఎగిసిపడే వరదల ధాటికి తట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే ఆ తీవ్రత బహిర్గతమవుతోంది. ఈ పరిస్థితుల్లో తీరప్రాంతాల భద్రతకు ఓ ప్రణాళిక అంటూ లేకుండా పోయింది. అనేక కమిటీలు నివేదికలు అందించినా.. నిపుణులు హెచ్చరించినా.. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క చర్యా తీసుకోలేదు. ఫలితంగా ఈ ఏడాది జల విలయం వందలాది గ్రామాలను కకావికలం చేసింది. ఈ క్రమంలో గోదావరి తీరంలోని వాస్తవ పరిస్థితులు, గతంలో జరిగిన నిర్లక్ష్యంపై ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక కథనం…
గడిచిన యాభై ఏళ్ళ కాలంగా నదీ పరివాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ జీవితాలు గడుపుతున్నాయి. ఉత్తర తెలంగాణాలోని ఆ ఆరు జిల్లాలను ప్రతియేటా వరదలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐదు దశాబ్దాల నుంచి వచ్చిన గోదావరి వరదను పరిశీలిస్తే.. సరాసరిన ప్రతి రెండేళ్లకోసారి నదీ పరివాహకంలో ఉన్న నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గ్రామాలన్నీ అతలాకుతలమయ్యాయి. తీవ్ర సమస్యగా పరిణమించి స్థానిక ప్రజలను, ముఖ్యంగా రైతు కుటుంబాలను వరదల ముప్పు వేధిస్తూనే ఉంది. 150కి పైగా గ్రామాల్లో నేటికీ తాత్కాళిక ఆవాసాల్లోనే జీవన వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొని ఉంది.
వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా గత ఏడాది సెప్టెంబరులో ఒక కమిటీ-ని ఏర్పాటు- చేశారు. ఈ కమిటీ- నదికి కుడి, ఎడమల వైపుల దాదాపు 64 కి.మీ కరకట్టను నిర్మించాలని సూచించింది. దీని నిర్మాణానికి రూ.1,624 కోట్ల వ్యయం అవుతుందని సమర్పించింది. ఇదిప్పుడు కార్యరూపం దాల్చాల్సి ఉంది. గోదావరి ఉధృతికి ఈ ఏడాది కూడా నదీ పరివాహక ప్రాంతాల వాసులు బెంబేలెత్తిపోయారు. గతేడాది జులైలో వచ్చిన భారీ వరద ప్రజలు తీవ్రంగా నష్టపోయేలా చేసింది. మళ్లీ తాజాగా అదే నెలలో వచ్చిన ఎగువ ప్రాంత వరద వారి జీవితాలను చిన్నాభిన్నం చేసి దెబ్బతీసింది. ఇలా తరచూ దెబ్బమీద దెబ్బపడి కోలుకోలేకుండా చేస్తూ.. వారికి కన్నీటిని మిగుల్చుతోంది. 2022 జులైలో వచ్చిన వరదలను ప్రజలు ఇప్పటికీ మరచిపోవడం లేదు. ఇదిలా ఉంటే ఎప్పుడు వరదలు వచ్చినా.. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. అందుకు అధికారులు అక్కడ 43 అడుగుల మట్టం దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను.. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను.. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
ఇరవై ఏళ్ళుగా మూడో ప్రమాద హెచ్చరిక
ఈ హెచ్చరికల్లో తొలి రెండు హెచ్చరికల స్థాయిల వరకు గోదావరి పొంగినా ముంపు ప్రాంత ప్రజలు తట్టు-కోగలుగుతున్నారు. కానీ మూడో ప్రమాద స్థాయి ఎప్పుడైతే దాటు-తుందో.. ఆ ఉధృతిని తట్టు-కోలేకపోతున్నారు. ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి.. పునరావాస కేంద్రాలకు వెళ్లడం, ఇంటిని, ఇళ్లలో ఉన్న వస్తువులు, పంటలు, పశుసంపద, డబ్బును కోల్పోతుండటంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ప్రతిసారీ ఇలానే వరద ముంచెత్తడంతో.. ఆర్థికంగా కుదురుకోలేక అప్పుల పాలైపోతున్నారు. ఇక అన్నదాతల పరిస్థితి చూస్తే.. మరీ దీనంగా కనిపిస్తోంది. గత యాభై ఏళ్లలో భద్రాచలం వద్ద ప్రవహించిన వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే.. 20 ఏళ్లకు పైగా మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహించింది. రెండో హెచ్చరికను దాటి 27 సంవత్సరాలు ప్రవహించి.. కన్నీటినే మిగిల్చింది. ఇప్పుడు పడిన వర్షాలకు మూడో ప్రమాద హెచ్చరికను దాటడంతో.. 55.70 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించింది.
120 గ్రామాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
గోదావరికి గతేడాది జులై 16న భద్రాచలం వద్ద వచ్చిన వరదలు 32 ఏళ్ల తర్వాత 70.3 అడుగుల స్థాయిలో ప్రవహించింది. ఈ ప్రవాహంతో దాని పరిధిలోని గ్రామాలు నీట మునిగాయి. అప్పటికి గోదావరి 70 అడుగులు మించి ప్రవహించడం మూడోసారి మాత్రమే. ఆ వరదలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 120 గ్రామాలకు చెందిన 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. తీవ్రనష్టమే జరిగింది. మళ్లీ ఈ ఏడాది అదే సీన్ రిపీట్ అవుతుందని అందరూ భయాందోళనలు చెందినా 55 అడుగుల మేర వచ్చి.. గోదావరి శాంతించింది. గోదావరి పరీవాహక ప్రాంతాలు అన్ని ముంపునకు గురయ్యాయి.
అమలుకు నోచుకోని ఆకనట్ట నిర్మాణ ప్రతిపాదన
చుట్టూ రెండు వైపుల ఎత్తయిన కొండలు.. గుట్టలు.. లోతట్టు- ప్రాంతం.. నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలోని రెండు గుట్టల మధ్యలో రెండు వాగుల నుంచి ఎప్పుడూ కడెం నీరు ప్రవహిస్తూనే ఉంటు-ంది. ఇక్కడ రెండు గుట్టలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే సుమారు 6.22 టీ-ఎంసీల నీటిని ఉపయోగంలోకి తీసుకురావచ్చనే ఉద్ధేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది. బోథ్ నియోజకవర్గంలో జలవనరులకు కొదువ లేదని, ఈ ప్రాజెక్టుకు మోక్షం లభిస్తే బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల చెందిన రైతులకు వరప్రదాయిగా మారుతుందని అప్పటి ప్రభుత్వం భావించింది. కానీ, ఆ కార్యాచరణ అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి కడెం వాగు వద్ద ప్రతి ఏటా కురుస్తున్న వర్షాలకు ప్రతియేటా సరాసరిగా 18 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో రూ.కోటి వ్యయంతో సర్వే చేశారు. 394 మీటర్ల స్థాయిలో రూ.744 కోట్ల వ్యయంతో 5.32 టీ-ఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజ్వరాయర్, 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే జలాశయం నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సమగ్ర సర్వే పూర్తిచేసి డీపీఆర్‌ను రూపొందించి అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.
వానాకాలం వస్తే చాలు… వణుకుతున్న గ్రామాలు
వానాకాలం వస్తోందంటే చాలు గోదావరి గట్టు-పై ఉన్న గ్రామాలు వణికిపోతున్నాయి. గతేడాది జులైలో వచ్చిన భారీ వరద ఉధృతే ఇందుకు కారణం. ఏటా ఒకటి రెండు మీటర్ల తీరం కోతకు గురవుతూ వస్తుండగా దీనికి భిన్నంగా గతేడాది కొన్ని చోట్ల ఐదు నుంచి పదిమీటర్ల వరకు గట్టు-కు కోత పెట్టి పొలాలను నది కలిపేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు నది వెడల్పు చాలా చోట పెరిగింది. ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు తీరం కోతలకు గురైంది. వందల ఎకరాల పొలాలు రూపురేఖలు కోల్పోయాయి. రొయ్యూరు సమీపంలో కట్ట నిలువునా కోతకు గురైంది. ఇక్కడ గోదావరి వంపు తిరుగుతుండటంతో నీళ్లు సుడులు తిరిగి కరకట్ట దెబ్బతింటోంది. కొంచెం కొంచెం కోస్తూ గతేడాది భారీగా దెబ్బతీసింది. కొన్నిచోట్ల పది మీటర్లలోపే వెడల్పు మిగిలింది. ఈ కట్ట కోతకు గురైందంటే ఏటూరునాగారం, మంగపేట పట్టణాలకు కూడా ముప్పు తప్పదని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ చర్యలు నామమాత్రం
వరద ముంపు ముప్పుపై నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సర్వేలు నిర్వహించాయి. అయినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులకు సంబంధించిన ప్రణాళిక, నిధులు విడుదలపై స్పష్టత రాలేదు. ఏటూరునాగారం- మంగపేట మండలాల్లో గోదావరికి మలుపులు ఉన్నాయి. దీంతో ప్రవాహం ఒకవైపు చొచ్చుకుని వస్తోంది. దీంతో 1990లో తీర ప్రాంతాల రక్షణకు 10.64 కిలోమీటర్ల పొడవుతో కట్ట నిర్మించారు. గతేడాది ఇది చాలా చోట్ల కోతపడింది. 5.9 కిలోమీటర్ల నుంచి 6.9 కిలోమీటర్ల మధ్య పాడయింది. అక్కడి నుంచి 7.7 కిలోమీటర్ల మధ్య కూడా లోపలి భాగం మట్టి కొట్టు-కు పోయింది.
రాజకీయ కారణాలతో అటకెక్కిన ప్రతిపాదనలు
కరకట్ట శాశ్వత స్థాయిలో మరమ్మతులకు ఉమ్మడి రాష్ట్రంలోనే టె-ండర్లు పిలిచినా.. అనేక రాజకీయ కారణాలతో పనులు మాత్రం జరగలేదు. వరదల ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వరదల్లో వందకుపైగా గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. భద్రాచలం, బూర్గంపాడు వద్ద నదికి రెండువైపులా వరద విస్తరించి వేలాది ఎకరాల పంట పొలాలను ముంచేసింది. ఎగువన ఒకవైపు మణుగూరు, అశ్వాపురం, మరోవైపు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నాలుగు రోజుల పాటు- వరద పో-టె-త్తి అనేక గ్రామలు అతలాకుతలమయ్యాయి. దీంతో ముంపు నుంచి శాశ్వత రక్షణ కల్పించేందుకు రూ.1585 కోట్లతో 58 కిలోమీటర్లు లేదా రూ.1625 కోట్లతో 65 కిలో మీటర్ల పొడవున కరకట్టలు నిర్మించాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించినా.. అవి అటకెక్కాయి.