భద్రాచలం వద్ద గంట గంటకూ గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స్థాయిలో నీటిమట్టం 69 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలో 23.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు. భద్రాచలంలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో నివాసాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాత్రి భద్రాచలంలోనే బసచేశారు. వరద, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.