Tuesday, November 26, 2024

48 అడుగులకు చేరిన గోదావరి.. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..

భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో జిల్లా కలెక్టర్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో నిన్న మధ్యాహ్నం 32 అడుగులు ఉన్న గోదావరి నేటి ఉదయం 6 గంటల 10 నిమిషాలకు 48 అడుగులకు చేరింది. పదహారు గంటల కాలంలో 16 అడుగులు పెరగడం విశేషం. దిగువకు 13 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరి మరింత పెరుగుతుంది అని సమాచారం. ఇది ఇలా ఉండగా జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. భారీగా వరద వస్తుండటంతో భద్రాద్రిలో స్నానఘట్టాల ప్రాంతం నీటమునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదవారి నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, రాత్రి 12 గంటలకు 43 అడుగులు దాటింది. దీంతో మొదటి హెచ్చరిక జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement