ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. తాజాగా భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదనీరు పోటెత్తడంతో భద్రాచలం స్నాన్నఘట్టం మెట్ల వరకు నీరు చేరింది. ప్రస్తుతం ఇక్కడ 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఇక వరదల కారణంగా నీటిమట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరద నీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది
భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 163వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. దీంతో ఈ జాతీయ రహదారిలో వాహనాల రాకపోలను అధికారులు నియంత్రించారు. వాహనాలు వెళ్కుండా ట్రాక్టర్లు, ట్రక్కులను అడ్డం పెట్టారు.