Saturday, November 23, 2024

Delhi | కర్ణాటక వెళ్లి చూడండి.. గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ నేత వీహెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ సాంప్రదాయం అని, తాము అమలు చేస్తున్న గ్యారంటీలపై అనుమానం ఉంటే కర్ణాటక వెళ్లి చూసి రావాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు (వీహెచ్) అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రకటించిన హామీల్లో ఇప్పటికే 2 అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.

నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తీసేసుకుందని ఆరోపించారు. కేవలం ధనవంతులకు మాత్రమే బీఆర్ఎస్ న్యాయం చేసిందని, ధరణి పోర్టల్ ద్వారా భూములు లాగేసుకున్నారని విమర్శించారు. రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయని, అందుకే తాము ధరణి రద్దు చేస్తామని చెబుతున్నామని అన్నారు. ఇచ్చిన మాట తప్పడంలో బీఆర్ఎస్‌కు ప్రత్యేక రికార్డ్ ఉందని, దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందో మాజీ సీఎం కేసీఆర్ చెప్పాలని అన్నారు.

బీజేపీ సైతం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో దాచిన నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తామని చెప్పిందని, కానీ ఏదీ అమలు చేయలేదని వీహెచ్ దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి, ఓటేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement