ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా అధికారపక్షం నిర్ణయం!
అమరావతి, ఆంధ్రప్రభ: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారిన జీవో నెం.1పై అధికార వైకాపా ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలను ప్రారంభిస్తోంది. జీవో నెం. 1 అనేది కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదని, అది తమతో సహా అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి కూడా ఈ ఆదేశాలు వర్తింపజేయాలని భావిస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించ డానికి అనుమతి కావాలని కోరుతూ చట్టసభల సమన్వయకర్త, రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు లేఖ రాశారు. తన నియోజకవర్గం పరిధిలోని లక్కిరెడ్డిపల్లి, దప్పేపల్లి, కోనంపేట గ్రామాల్లో గడప గడపకు.. కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు- ఇది కొనసాగుతుందని, దీన్ని నిర్వహించుకోవడానికి అనుమతి కావాలంటూ పోలీలసులను కోరారు. ఈ మేరకు శ్రీకాంత్ రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి నిస్సార్ అహ్మద్ రాయచోటి డీఎస్పీకి లేఖ రాశారు. ఇప్పుడిది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది కేవలం శ్రీకాంత్ రెడ్డి వరకే పరిమితమా లేక రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోని సిట్టింగులు, కో ఆర్డినేటర్లు పాటిస్తూ తాము ప్రతి రోజూ నిర్వహించే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పోలీసుల నుండి అనుమతి కోరతారా అంటూ రాజకీయవర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకే సీఎం జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని, అది శ్రీకాంత్ రెడ్డితో ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పల్లెల్లో నిర్వహించే సందర్భంలో అనుమ తులు అవసరం లేదని, కేవలం పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుం డానూ, ఇరుకురోడ్లలో ర్యాలీలు నిర్వహించే సందర్భం లో ప్రమాదాలు తలెత్తకుండా ఉండేలా అనుమతులు కోరే అవకాశముం దని అంటున్నారు.
చంద్రబాబు సభల్లో తొక్కిసలాటతో..
డిసెంబర్ 28న నెల్లూరు జిల్లా కందుకూరులో, జనవరి 1వ తేదీన గుంటూరుల్లో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇలాంటి విషాదకర ఘటనలు మళ్లీ మళ్లీ చోటు-చేసుకోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 1ని బయటకు తీసుకొచ్చింది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించడాన్ని నిషేధించడమే ఈ జోవో ముఖ్య ఉద్దేశ్యం. ఈక్రమంలోనే ఈజీవో బ్రిటీష్ కాలంనాటిదని, దానిని ఇప్పుడెలా అమలు చేస్తారంటూ ప్రతిక్షాలు రాద్దాంతం చేశాయి. చంద్రబాబు కుప్పం పర్యటన కూడా ఈజీవో నేపథ్యంలో ఉద్రిక్తంగానే సాగింది. ఇక ప్రముఖ సినీ నటుడు బాలయ్య ఒంగోలులో నిర్వహించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు, ఆదివారం విశాఖలో మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కూ ఈ అంక్షలు కొనసాగాయి. ఇక ఈనెల 12న జనసేనాని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో నిర్వహించబోయే సభకూ వర్తించనున్నాయి. ఈనేప థ్యంలోనే చంద్రబాబు, పవన్ కల్యాన్ భేటీ అయి ఈ జోవోపై ఆదివారం చర్చించారు. జీవోను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాజాగా చర్చనీ యాంశంగా మారింది.
కారణాలను గమనించకపోవడంపై అసంతృప్తి
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ జీవోను జారీ చేయడానికి గల కారణాలను ఏ మాత్రం పట్టించుకో వట్లేదని ప్రభుత్వం గుర్రుగా ఉంది. జోవో జారీచేసిన మరునాడే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దీనిపై స్పందించారు. భవిష్యత్‌లో ఇంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉండాలంటే ఇటువంటి చట్టాలు అమలు చేయాల్సిందేనన్న ఆయన ఇప్పటికీ మనం బ్రిటీష్ కాలం నాటి చట్టాలనే వాడుతున్నామని గుర్తుచేశారు. ఈనేప థ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు.. ఈ జీ వోను తీసుకుని రావడాన్ని తప్పు పడుతున్నాయే తప్ప అందుకు దారి తీసిన ఉదంతాలపై దృష్టి సారించట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతుందో దానికి సహకరించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలపై అంతే ఉందని, అలాంటప్పుడు ప్రజల ప్రాణాలు కోల్పోకుండా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిం చాల్సిందిపోయి దీనిపై రాజకీయాలు చేయడం పట్ల అధికార పక్షం తీవ్రంగా తప్పుబడుతోంది.
అధికార పక్షం తాజా నిర్ణయంతో….
ఇందులో పొందుపరిచిన నిబంధనలు, మార్గ దర్శకాలు తమ పార్టీకి కూడా వర్తిస్తాయని, బహిరంగ స భలు, ర్యాలీలను నిర్వహించాలంటే తాము కూడా పోలీ సుల నుంచి అనుమతులను తీసుకుంటామని అధికా రపక్షం చెప్పకనే చెబుతోంది. ప్రభుత్వ అధికార కార్యక్రమానికే అనుమతులు తీసుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు తమ సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతులు తీసుకోవడం, కచ్చితంగా నిర్ణయించిన స్థలాల్లోనే వాటిని నిర్వహించుకునేలా చూసుకోవడం కూడా ఆయా పార్టీల బాధ్యతగా తీసుకోవాల్సిన అవస రాన్ని గుర్తు చేస్తోంది. అధికారపక్షం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టినట్లయింది.