Friday, November 22, 2024

Delhi: హైదరాబాద్‌లో గ్లోబల్ పీస్ సమ్మిట్.. అడ్డుకుంటున్న కేసీఆర్, కేటీఆర్: కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 2న ‘గ్లోబల్ పీస్ అండ్ ఎకనమిక్ సమ్మిట్’ నిర్వహించనున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ శాంతి సభకు 200 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రపంచ ప్రముఖులు ఈ శాంతి సభకు హాజరవుతారని, అలాగే దీంతోపాటు జరిగే ఎకనమిక్ సమ్మిట్‌ ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కేటీ రామారావు కుట్ర చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు.

ఈ శాంతిసభను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా లేఖలు రాశారని, తాము ఇటు అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించామని, కానీ ఆయన ఆహ్వానాన్ని మన్నించకపోగా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. వరుణ్ గాంధీయే స్వయంగా ఈ విషయం తనకు చెప్పారని, హైదరాబాద్ శాంతి సభకు వెళ్లొద్దని కేటీఆర్ వరుణ్ గాంధీకి ఫోన్ చేశారని ఆరోపించారు. శాంతి సభను ఎవరు అడ్డుకోవాలని చూసినా దేవుడి శాపానికి గురవుతారని, చరిత్రలో రాష్ట్ర ద్రోహులుగా, దేశద్రోహులుగా మిగిలిపోతారని కేఏ పాల్ అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దుష్టశక్తిలా మారారని పాల్ మండిపడ్డారు. శాంతిసభను అడ్డుకోవాలని చూసినందుకు ఆయనకు పాట్నాలో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. మీడియా ముందే “చెప్పింది చాలు.. ఇక లే” అన్నట్టుగా నితీశ్ కుమార్ వ్యవహరించారని గుర్తుచేశారు. కేసీఆర్ పక్కా అవకాశవాది అని.. ఎవరు గెలుస్తారంటే వారి పంచన చేరతారని అన్నారు. అందుకే ఆయన్ను పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించినట్టే ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోయినట్టే కేసీఆర్‌కు కూడా పతనం మొదలైందని పాల్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని, 8 ఏళ్లలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. తాను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో తాను ఏర్పాటుచేస్తున్న సభ శాంతితో పాటు అభివృద్ధిని కూడా తీసుకొస్తుందని అన్నారు.

- Advertisement -

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మనుగోడు ఉప-ఎన్నికలను డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా నిర్వహించాలని కోరినట్టు చెప్పారు. ప్రశాంత్ కిశోర్ సహాయంతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని అన్నారు. అలాగే తమ ఎన్నికల గుర్తు ‘హెలీకాప్టర్’ను తమకు కేటాయించాల్సిందిగా కోరినట్టు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్ వినియోగించాలని, అమెరికా తరహాలో పోలింగ్ పూర్తయిన మరుక్షణమే కౌంటింగ్ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని కూడా కోరినట్టు ఆయన తెలిపారు. తద్వారా ఎన్నికల అక్రమాలకు తావులేకుండా ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement