న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఈసారి దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం వేదికగా మారింది. వివిధ దేశాల రాయబారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరాన్ని భవిష్యత్తు కార్యనిర్వాహక రాజధానిగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రాజధాని వ్యవహారంపై కేసు ఎటూ తేలకముందే ఆయన ఈ ప్రకటన చేయడం రాష్ట్రంలో కొత్త కలకలానికి దారి తీసింది. సోమవారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023’ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ నగరంలో ఈ సమ్మిట్ జరగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తొలుత ‘ఇంటర్నేషనల్ డిప్లమాట్ అలియన్స్ మీట్’ నిర్వహించారు. ఇందులో వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. “విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. విశాఖలో పెట్టుబడులకు మిమ్నల్ని ఆహ్వానిస్తున్నాను. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నాను. నేను మీ అందరినీ వ్యక్తిగతంగా ఆ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాను. సదస్సుకు హాజరు కావడంతో పాటు పెట్టుబడులతో ముందుకు రావాలి. మీతో పాటు మీ సహచరులను ఇతర కంపెనీ ప్రతినిధులను కూడా ఆ సదస్సుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో చూపించాలి.” అన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నమని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో భారతదేశం ప్రపంచ వేదికపై ముందువరుసలో ఉందని, ఈ క్రమంలో ఏపీలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతల గురించి వారికి వివరిస్తూ.. 11.43 శాతం జీఎస్‌డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా గడిచిన మూడేళ్లుగా దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో కొనసాగుతోందని చెప్పారు. పరిశ్రమల స్ధాపనకు తాము చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నామని తెలిపారు. ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, నాలుగు ప్రాంతాల్లో 6 మేజర్ పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటకి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం మొత్తమ్మీద 6 విమానాశ్రయాలు ఉన్నాయని, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను కూడా నిర్మిస్తున్నామని వివరించారు. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉందని, ఇవన్నీ ఏపీలో ఖనిజాధార కంపెనీల ఏర్పాటుకు సానుకూలాంశాలని తెలిపారు. ప్రధానంగా పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమల్లో ఉందని, 21 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో అనేక ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయని, వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కియా మోటార్స్ (సౌత్ కొరియా) ఎండీ మరియు సీఈఓ జిన్ పార్క్, టోరె ఇండస్ట్రీస్ ఎండీ మరియు సీఈఓ యామా గుచీ (జపాన్), క్యాడ్‌బరీ ఇండియా అధ్యక్షుడు (యూఎస్‌ఏ) దీపక్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ (ఇటలీ) రోషన్ గుణవర్దన, అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ (తైవాన్) డైరెక్టర్ సెర్జియో లీ, సెయింట్ గోబియన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్(ప్రాన్స్) తరపున బి. సంతానం సహా పలుదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటా
మధ్యాహ్నం తర్వాత జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ సన్నాహక సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలాంశాలు, అనుకూలతలను వివరిస్తూ ఒక వీడియో ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, సీఐఐ సదరన్ రీజయన్ చైర్‌పర్సన్ సుచిత్రా ఎల్లా వంటి పారిశ్రామిక ప్రతినిధులు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైజాగ్ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయని, రాష్ట్రంలోని 80 శాతానికి పైగా జిల్లాలను ఈ మూడు కారిడార్లు కవర్ చేస్తున్నాయని వివరించారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, 2021–22లో 11.43 శాతం గ్రోత్ రేటుతో దేశంలోనే మొదటి స్ధానంలో ఉన్నామని చెప్పారు. అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు (పోర్ట్ లెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ ఎనర్షియా అవార్డు 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) అవార్డులు వచ్చాయని జగన్ ఉదహరించారు.
ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. తమ రాష్ట్రం గురించి తాము గొప్పగా చెప్పుకోవడం కాదని, ఇప్పటికే పరిశ్రమలు స్థాపించినవారిని అడిగి తెలుసుకోమని సీఎం సూచించారు. వేగవంతంగా అనుమతులు మంజూరు చేయడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉందని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, కరెంటు, నీళ్ల విషయంలో దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే తక్కువ ధరలకే అందిస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలమైన అవకాశాలున్నాయని తెలిపారు. 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 14,680 మెగావాట్లకు సంబంధించి ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయని అన్నారు.
ఈ రంగంలో ఇంకా పెట్టుబడులకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ఏపీ గ్రీన్ ఎనర్జీలో కీలకపాత్ర పోషించబోతుందని జగన్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు జగన్ హామీ ఇచ్చారు. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌక్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటానని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ ప్రెసిడెంట్ సుచిత్రా ఎల్లా, అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ డైరక్టర్ డా. సృజన తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు కూడా సమావేశానికి హాజరయ్యారు.సమావేశం అనంతరం నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి బయల్దేరిన ముఖ్యమంత్రి విజయవాడకు తిరుగుప్రయాణమయ్యారు.