న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బౌద్ధ జీవన విధానం ద్వారా నేటి ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యలకు మార్గం లభిస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలోని అశోకా హోటల్ లో.. గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ – 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి.. శాంతి, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం తదితర సమస్యలనుంచి బయటకు వచ్చేందుకు మార్గం చూపడంతోపాటు.. సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకునేందుకు గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ – 2023 మార్గదర్శనం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా.. బౌద్ధ మతంతో సంబంధం ఉన్న దేశాలతో సాంస్కృతిక, దౌత్యపరమైన సంబంధాల బలోపేతానికి బాటలు పడతాయని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.
భారతదేశం బౌద్ధ మతానికి పుట్టినిల్లని గుర్తుచేసిన కిషన్ రెడ్డి.. బుద్ధుని బోధనల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా మన దేశం శాంతి సందేశాన్ని అందిస్తోందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దేశంలో బౌద్ధమతానికి సంబంధించిన క్షేత్రాల వద్ద మౌలికవసతుల కల్పనతోపాటు.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు, బౌద్ధమతాన్ని అనుసరించే వారు వచ్చేందుకు కనెక్టివిటీ కార్యక్రమాలను వేగవంతంగా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. వైశాఖ పౌర్ణిమ, ఆశాఢ పౌర్ణిమ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంతోపాటుగా.. బుద్ధ భగవానుడి మహాపరినిర్వాణం జరిగిన కుశీనగర్ లో గతేడాది అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన విషయాన్నీ కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరెన్ రిజిజు, సహాయ మంత్రులు మీనాక్షీ లేఖి, అర్జున్ రామ్ మేఘ్వాల్ తోపాటు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్, ఇతర బాధ్యులు, దాదాపు 30 దేశాలనుంచి వచ్చిన బౌద్ధమత పెద్దలు, బౌద్ధమతాన్ని అనుసరిస్తున్న ప్రముఖులు, భారతదేశంలోని వివిధ బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.