న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రజక సామాజిక వర్గానికి ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ధోబీ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించారు. సోమవారం జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రజకులు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడితో పాటు వివిధ పార్టీల నాయకులు వారికి మద్దతు తెలిపారు. తమ సామాజికవర్గం 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉందని జాతీయ ధోబీ మహాసంఘ్ జాతీయ కన్వీనర్ డాక్టర్ అన్నవరపు నాగమల్లేశ్వరరావు అన్నారు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రజకులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
2014లో టీడీపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి త్రిసభ్య కమిటీ వేసిందన్నారు. రజకులను ఎస్సీల జాబితాలో చేరుస్తామని 2019 ఎన్నికల్లో బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని ఆయన తెలిపారు. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర అసెంబ్లీలు కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని నాగమల్లేశ్వరరావు చెప్పారు. తల్లి గర్భం నుంచి సమాధి అయ్యే వరకు దేశీయ సంప్రదాయాల కొనసాగింపులో రజకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. ఒకే కులం-ఒకే వృత్తి-ఒకే దేశం-ఒకే రిజర్వేషన్ తమ నినాదమని వెల్లడించారు. లక్షల్లో జనాభా కలిగి ఉండి కూడా అణచివేతకు గురవుతున్న, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడిన రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.