Saturday, November 23, 2024

పసుపు బోర్డు ఇవ్వండి – రైతులను ఆదుకోండి: రైతు సంఘం నేత న‌ర‌సింహ‌నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు పోరాటంలో పాల్గొన్న రైతులను కిసాన్ విజయ్ ఉత్సవ్ సమితి మంగళవారం సన్మానించింది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో కోటపాటి నరసింహ నాయుడు కిసాన్ రత్న అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం ప్రకటించినా ఇప్పటివరకూ అన్నదాతల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలను చూసి నేర్చుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో రైతుకు పెట్టుబడి సహాయం, ఉచిత విద్యుత్, పండిన పంటను కొనడం, సమయానికి ఎరువుల అందించడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని నరసింహ నాయుడు చెప్పుకొచ్చారు.

గతంలో తాము పసుపు బోర్డ్ కోసం ఢిల్లీ వచ్చి ధర్నా చేయగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తమకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే బీజేపీ నాయకులు నిజామాబాద్‌కు వచ్చి పసుపు బోర్డ్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఒక ఎంపీ సీటు గెలుచుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పసుపు బోర్డ్ ఇవ్వకుండా బోర్డ్ పనికిరాదంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని నరసింహ నాయుడు మండిపడ్డారు. ఇది రైతులకు నిలువునా ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. ఇకనైనా పసుపు బోర్డ్ మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని నరసింహ నాయుడు డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement