న్యాయ సహాయం కోసం సమయం, శక్తిని వెచ్చించాలని న్యాయ విద్యలో పట్టభద్రులకు సుప్రీం సీజేఐ యుయు లలిత్ పిలుపునిచ్చారు. ఒడిశాలోని నేషనల్ లా యూనివర్సిటీ 9వ స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. గ్రాడ్యుయేట్లు వృత్తిపట్ల సంపూర్ణ మక్కువ కలిగివుండాలని, దేశ ప్రజలపట్ల దయతో ఉండాలని సూచించారు. ఏడాదిపాటు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో తన అనుబంధం సందర్భంగా, దేశంలో న్యాయ సహాయం చేసేపని కొన్నిసార్లు నిర్లక్ష్యానికి గురవడాన్ని గమనించానని చెప్పారు. కానీ, యువ గ్రాడ్యుయేట్లు తమ సమయాన్ని, శక్తిని న్యాయ సహాయ కార్యక్రమానికి వెచ్చించాలని కోరారు. ఇకపై ప్రతి సందిగ్దంలో సమాజం మీ సహకారం కోసం ఎదురు చూస్తుంది.
పౌర హక్కులను చెక్కుచెదరకుండా ఉంచడంలో న్యాయవాద వృత్తి ముందున్నదని సీజేఐ పేర్కొన్నారు. చట్టబద్దంగా శిక్షణపొందిన మనస్సులు అవినీతిపై గళమెత్తినప్పుడు దీపస్తంభాలై ఆకర్షణీయ కేంద్రాలుగా ఉన్నాయని ప్రతిసమాజం, ప్రతిదేశ చరిత్ర చాటిచెబుతోంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ పరిషత్ వ్యవస్థాపక పితామహులు చాలామంది మీ వృత్తినుంచి వచ్చినవారే. దేశ భవిష్యత్‌కు బాటలు వేసినవారేనని సీజేఐ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మొత్తం 221 మంది గ్రాడ్యుయేట్లకు పట్టాలను ప్రదానం చేశారు.