న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కృష్ణా జలాల నుంచి వాటా పెంచి ఆ మేరకు అనుమతులు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరామ్ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ఓ ప్రకటన జారీ చేసిన బండి సంజయ్.. కృష్ణా జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పిదం దక్షిణ తెలంగాణ ప్రజలకు శాపమైందని ఆరోపించారు. ఆనాడు 299 టీఎంసీలకు అంగీకరించడం వల్ల నేడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు నష్టపోకుండా చూడాలంటూ తాను కేంద్ర మంత్రిని కోరినట్టుగా ఆయన చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందన్నారు. క్రిష్ణా జలాల వాటా కేటాయింపుల సందర్భంగా సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం కల్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే క్రిష్ణా జలాల వాటా నీటి కేటాయింపులతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అనుమతి ఇవ్వాలని కోరారు. బండి సంజయ్ విజ్ఝప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. వెంటనే డీపీఆర్ ను కేంద్ర జలవనరుల సంఘానికి (సీడబ్ల్యూసీ) పంపి పరిశీలించడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల అనుమతి విషయంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లేన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఉత్తర తెలంగాణలో దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో భాగంగా కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ-సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధులు కేటాయింపుతోపాటు రైల్వే లేన్ నిర్మాణ పనులను ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బండి సంజయ్ శుక్రవారం మధ్యాహ్నం రైల్వే మంత్రి అశ్వీనీ వైష్ణవ్ ను కలిసి కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగ్గట్టుగా ఆ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ విషయానికొస్తే… 2013లో ఈ రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా రైల్వే లైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని ఈ సందర్భంగా బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ పరిశ్రమతో పాటు వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణా సులువు కానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఈ రైల్వే లేన్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.