న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫీజ్ రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్, హాస్టళ్ల నిర్వహణ, గురుకుల పాఠశాలల నిర్వహణ, బీసీ కార్పొరేషన్ రుణాలు వంటి పలు పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం గ్రాంటు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంగళరావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, రాంచదర్‌రావులతో సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర సింగ్‌ను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు.
కేంద్రం బీసీల కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో 370 బీసీ కాలేజీ హాస్టళ్లు, 1354 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణలో 290 బీసీ కాలేజీ హాస్టళ్లు, 280 బీసీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు. వారికి సొంత భవనాలు నిర్మించడానికి 80 శాతం గ్రాంటు ఇవ్వాలని కోరారు. అలాగే జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు రాష్ట్రాలు నర్వహిస్తున్న బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజురు చేయాలని కేంద్రమంత్రి వీరేంద్ర సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 56 బీసీల కుల కార్పొరేషన్లు, తెలంగాణలో రెండు బీసీ కార్పొరేషన్లు, 12 బీసీ కుల ఫెడరేషన్లు నడుస్తున్నాయని, వాటి ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల నుంచి 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని ఎంపీలు అభ్యర్థించారు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే బాలుగురుకుల పాఠాశాలలకు 60 శాతం బాలికల కాలేజీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు 80 శాతం గ్రాంటు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.