Friday, November 22, 2024

ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తాం.. అహ్మదాబాద్‌లో కేజ్రీవాల్‌ రోడ్ షో..

బీజేపీకి అహంకారం వచ్చిందని, గుజరాత్‌లో తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని ఢిల్లి సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఘన విజయం సాధించిన తరువాత.. కేజ్రీవాల్‌ అసెంబ్లి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో.. శనివారం గుజరాత్‌లో పర్యటించారు. ముందుగా అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన పంజాబ్‌ సీఎం మాన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ రాట్నం తిప్పారు. అనంతరం ఆప్‌ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌లో బీజేపీ 25 ఏళ్లుగా అధికారంలోకి కొనసాగుతోందన్నారు. అయినా ఇక్కడ అవినీతి మాత్రం కొనసాగుతూనే ఉందని విమర్శించారు. ఏ పార్టీపై నిందలు, విమర్శించేందుకు తాను ఇక్కడికి రాలేదని, బీజేపీని ఓడించే ఉద్దేశంతో ఇక్కడి రాలేదన్నారు. కాంగ్రెస్‌ను ఓడించాలని ఇక్కడ రాలేదని, గుజరాత్‌ను గెలిపించేందుకు తాను ఇక్కడి వచ్చానని స్పష్టం చేశారు. గుజరాత్‌, గుజరాతీల విజయం కోసం ఇక్కడి వచ్చానని, ఇక్కడ ఉన్న అవినీతిని రూపు మాపేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు.

బీజేపీకి అహంకారం వచ్చింది..

25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి అహంకారం వచ్చిందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఒక్కసారిగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. పంజాబ్‌, ఢిల్లిd ప్రజల తరహాలోనే.. గుజరాతీలు ఆప్‌ను ఆశీర్వదిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాలనకు అవకాశం ఇస్తే అవినీతి రూపుమాపుతామని, ఒక వేళ్ల తమ పాలన నచ్చకపోతే.. ఆ తరువాతి ఎన్నికల్లో తమను ఓడించాలని కోరారు. ఈసారి ఆప్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా విన్నవించుకున్నాడు. అన్ని పార్టీలను మరిచిపోయి ఆప్‌కు ఓటేయాలని కోరారు. పంజాబ్‌ సీఎం మాన్‌ మాట్లాడుతూ.. ఢిల్లి, పంజాబ్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని, ఇప్పుడు గుజరాత్‌ను అలాగే తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు వివరించారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా.. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం మాన్‌లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా సొంత ఇలాకాలో.. ఆప్‌ శ్రేణులు భారీ రోడ్‌ షోను నిర్వహించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement