న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగేశ్వర క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలంటూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆలయ ప్రధానార్చకులు నాయుగారి రాజశేఖర్ కోరారు. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ప్రస్తుతం నిరాదరణకు గురైందని, కేంద్ర పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న ఈ ఆలయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
20 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఆలయానికి అందలేదని తెలిపారు. దాంతో ప్రస్తుతం అక్కడ మౌలిక వసతులు సైతం లేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మాటలు చెబుతోంది తప్ప నిధులిచ్చి అభివృద్ధి చేయడం లేదని ప్రధానార్చకులు పేర్కొన్నారు. ఆలయం గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధికి సహకరిస్తానంటూ హామీ ఇచ్చారని ప్రధానార్చకులు ఓ ప్రకటనలో తెలిపారు.