Friday, November 22, 2024

వీలైనంత త్వరగా బాధితులకు కోవిడ్ నష్టపరిహారం అందజేయండి.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్ నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయకపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం, తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా మొత్తం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నష్టపరిహారం అందజేయని విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ వైఫల్యంపై టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సోమవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పల్లా శ్రీనివాసరావు తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్‌కుమార్ బన్సల్ వాదనలు వినిపించారు. 7 వేలకు పైగా పేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేయలేదన్న విషయాన్ని గౌరవ్‌కుమార్ బన్సల్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. విపత్తుల నిధి నుండి కోవిడ్ నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించకుండా దారి మళ్లించిన తీరుపై గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement