న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అర్థాంతరంగా విద్యాభ్యాసాన్ని వదిలి స్వదేశాలకు తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులను ఆదుకోవాలని భువనగిరి ఎంపీ (కాంగ్రెస్) కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసిన కోమటిరెడ్డి, బీబీనగర్ ఎయిమ్స్ అంశంతో పాటు ఉక్రెయిన్ బాధిత భారత వైద్యవిద్యార్థుల సమస్య గురించి కూడా చర్చించినట్టు తెలిపారు. కొన్ని అంచనాల ప్రకారం దాదాపు 15 -16వేల మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చారని తెలిపారు. దేశంలో ఉన్న మొత్తం 606 మెడికల్ కళాశాలల్లో సగటున ప్రతి కాలేజీలో 20-21 మందిని సప్లిమెంటరీ బ్యాచ్ కింద చేర్చుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ వైద్య విద్యార్థుల అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తోందని, దాదాపు 22 వేల మంది వైద్య విద్యార్థులు చైనాలో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా చర్చలు జరిపిందని, ఇందుకు చైనా కూడా సుముఖత వ్యక్తం చేసిందని కోమటిరెడ్డి తెలిపారు.
మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ భవనంలో అవసరమైన అదనపు మౌలిక వసతుల కోసం కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించారు.