న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లు సహా పలు ఇతర అంశాలపై ‘స్టే’ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళవారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించిన కవిత తరఫు న్యాయవాది దుష్యంత్ దవే, తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. వెంటనే విచారణ చేపట్టేందుకు నిరాకరించిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, మార్చి 24న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు.
ఈడీ కార్యాలయానికి పిలవడం చట్ట విరుద్ధం
ఈడీ సమన్లు, విచారణ తీరును తప్పుబడుతూ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత, మద్యం పాలసీ వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌లో తన పేరు లేదని పేర్కొన్నారు. కేసులో సీబీఐ, ఈడీ అరెస్టు చేసిన కొందరు వ్యక్తుల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని తనను విచారణకు పిలిచారని తెలిపారు. నిజానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 ప్రకారం ఏ కేసులోనైనా ఏ దర్యాప్తు సంస్థైనా మహిళను సాక్షిగా ప్రశ్నించాల్సి వస్తే, ఆమె ఉండే చోటకే దర్యాప్తు అధికారులు వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఈడీ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని తప్పుబట్టారు. మార్చి 7వ తేదీన ఈడీ తనకు సమన్లు జారీ చేసి మార్చి 9న ఢిల్లీలోని కార్యాలయానికి హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొందని తెలిపారు.
ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల దృష్ట్యా తనకు వారం రోజుల సమయం కావాలని, హైదరాబాద్‌లో తానుండే ఇంట్లోనే విచారణ జరపాలని కోరుతూ మెయిల్ చేశానని చెప్పారు. అయితే ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై తమ కస్టడీలో వారం రోజులు మాత్రమే ఉంటాడని, అతనితో కన్‌ఫ్రంటేషన్ (ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం) ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంటూ తన అభ్యర్థనను ఈడీ తిరస్కరిస్తూ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలో వ్యక్తుల నివాసాల్లో విచారణ జరిపాలంటూ ఎక్కడా నిబంధనలు లేవని బదులిచ్చారని కవిత తన పిటిషన్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మార్చి 9న రావడం కుదరకపోతే మార్చి 11న హాజరుకావాలని తనకు బదులిచ్చారని, ఆ మేరకు తాను ఆ రోజు విచారణకు హాజరవగా… తన అంగీకారంతో సంబంధం లేకుండా తన ఫోన్ జప్తు చేసుకున్నారని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్లు 50(2), 50(3) ప్రకారం నోటీసులిచ్చారని, వాటిలో తనను వ్యక్తిగతంగా హాజరవాలని మాత్రమే ఉంది తప్ప సెల్‌ఫోన్ తీసుకురావాలని ఎక్కడా లేదని పేర్కొన్నారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు ‘థర్డ్ డిగ్రీ’ తరహా విధానాలను అవలంబిస్తున్నారని పిటిషనర్ కవిత ఆరోపించారు. రెండు ఉదంతాలను ఆమె ఉదహరించారు. కేసులో విచారణ కోసం చందన్ రెడ్డిపై అధికారులు దాడికి పాల్పడితే అతనికి వినికిడి సమస్య ఏర్పడిందని, న్యాయస్థానంలో ఈ విషయాన్ని చందన్ రెడ్డి ప్రస్తావించారని ఆమె గుర్తుచేశారు. అలాగే తనతో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెబుతూ అరుణ్ రామచంద్రన్ పిళ్లై స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
తన విషయంలోనూ ఈడీ అధికారులు దురుసుగా వ్యవహరించారని, ఒక మహిళా ప్రజా ప్రతినిధినని కూడా చూడలేదని ఆరోపించారు. కేసులో అరెస్టయిన వ్యక్తుల రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్లలో తన ఫోన్ నెంబర్లను ప్రచురించడమేగాక.. ఆ నివేదికలను బహిర్గతం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆమె ఆరోపించారు.
‘స్టే’ ఇవ్వకపోతే తీరని నష్టం
మార్చి 7న, మార్చి 11న ఇచ్చిన సమన్లతో పాటు సెల్‌ఫోన్ జప్తు చేసుకుంటూ ఇచ్చిన ఇంపౌండిగ్ ఆర్డర్‌పై ‘స్టే’ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. అలాగే పిటిషనర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. మధ్యంతర ఉత్తర్వులతో ఊరటనివ్వకపోతే పిటిషనర్ కవితకు తీరని నష్టం వాటిల్లుతుందని, ఊరట ఇవ్వడం ద్వారా దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని పిటిషన్లో పేర్కొన్నారు.