Tuesday, September 17, 2024

GHMC – ఈ మహా నగరానికిఏమైంది? కాంగ్రెస్‌ పాలనపై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్​లో శాంతి లేదు
సామాన్య ప్రజలకు భద్రత లేదు
హైదరాబాద్​లో వరుస హత్యలు
పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు
పడగవిప్పిన హత్యల సంస్కృతి
కుప్పకూలుతున్న రియల్​ రంగం
యువత ఉపాధి అవకాశాలకు పెద్ద దెబ్బ
గడియ గడియకు పవర్​ కట్​లు
విశ్వనగరం హైదరాబాద్​ ప్రగతికి అర్ధంతరంగా బ్రేకులు
ఇదంతా పరిపానలనా అనుభవం లేని నాయకత్వ లోపమే
ఇకనైనా కాంగ్రెస్​ సర్కారు మేల్కొనాలి
హైదరాబాద్​ కేవలం రాజధాని కాదు.. తెలంగాణ ఎకనామిక్​ ఇంజిన్
ట్విట్టర్​ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన కేటీఆర్​


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ఈ మహానగరానికి ఏమైంది అంటూ బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. గురువారం పలు అంశాలపై ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అంతేకాకుండా.. “బ్రాండ్ హైదరాబాద్” ఎందుకు మసకబారుతోంది?.. విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ.. ఎందుకింత కళ కోల్పోతోంది?.. అని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఇదే ఆవేదన ఉందన్నారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న హైద‌రాబాద్ సిటీలో వరుస హత్యలు.. పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాల తీరు క‌నిపిస్తోంద‌న్నారు.

- Advertisement -

హైద‌రాబాద్‌లో శాంతి లేదు.. ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త లేదు..

రాజధాని హైదరాబాద్‌లో శాంతి లేదని.. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారు స్వయంగా.. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తున్నా.. పోలీసింగ్‌పై కమాండ్ ఏది అని ప్రశ్నించారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది అని నిలదీశారు. ఓవైపు.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.. పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందన్నారు. మరోవైపు పడగవిప్పిన హత్యల సంస్కృతి.. ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందన్నారు. ఇంకోవైపు.. తరలిపోతున్న పెట్టుబడుల పర్వం.. యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌డియ గ‌డియ‌కు ప‌వ‌ర్ క‌ట్ ఏమిటీ?

కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే గడియ గడియకు ప‌వ‌ర్ క‌ట్ ఏమిటీ? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్‌ రేట్‌ ఎందుకు పెరిగిపోతోంద‌న్నారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని మండిపడ్డారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి.. పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే.. అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా?.. దేశ రాజధాని చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ.. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని మండిపడ్డారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదు. ‘‘తెలంగాణ ఎకనమిక్ ఇంజన్” అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇకనైనా.. కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే మన హైదరాబాద్ దెబ్బతింటే.. రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement