Friday, November 8, 2024

హైదరాబాద్: టులెట్ బోర్డు పెట్టినందుకు రూ.2వేలు జరిమానా

హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ వ్యాపార, వాణిజ్య, ఇల్లు వంటివి అద్దెకు ఇవ్వబడును అనే పేరుతో వాల్‌పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటి ఏర్పాట్లు చేస్తే జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే బహిరంగ ప్రచారాలపై ఇప్పటికే నిషేధం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. మూసాపేట డివిజన్‌ పరిధిలోని ఓ దుకాణ యజమాని ఏర్పాటు చేసిన ‘టు లెట్‌’ స్టిక్కర్‌కు అధికారులు రూ.2 వేల జరిమానా విధించారు. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

మోతీనగర్‌ పరిధిలోని పాండురంగానగర్‌ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్య గౌడ్‌ ఒక దుకాణంలో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే ఉన్న అతని మరో దుకాణం ఫిబ్రవరిలో ఖాళీ అయ్యింది. దీంతో ఆయన ‘టు లెట్‌’ పేరుతో తన ఇంటి గోడకు పోస్టర్ అంటించారు. దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్‌ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్‌ అందుకు రూ.2 వేల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో ఈ-చలానా ద్వారా జరిమానా చెల్లించాలని అందులో వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్ జంట పేలుళ్లకు 14 ఏళ్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement