ప్రభ న్యూస్ బ్యూరో, గ్రేటర్ హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణంకోసం జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు సిద్ధమైంది. నగర వ్యాప్తంగా అడాప్టెడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ఏటీఎస్సీ) సిస్టమ్ ద్వారా పాదాచారుల ప్రమాదాల నివారణకు పెలికాన్ సిస్టమ్ ద్వారా సిగ్నల్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్‌శాఖ అధికారులు పోల్ మార్కింగ్ లొకేషన్ గుర్తింపుచేసి జీహెచ్‌ఎంసీకి సిఫార్స్ చేస్తారు. వారి సూచనలు, ప్రతిపాదన మేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సిగ్నల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడాప్టెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా 96 సిగ్నల్స్, పెలికాన్ సిస్టమ్ ద్వారా మరో 70 సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. సిగ్నల్స్ ఏర్పాటులో పోలీస్‌శాఖ సూచించిన మేరకు అవకాశాన్ని బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయుటకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది.
త్వరలో 334 సిగ్నల్స్ అందుబాటులోకి ..
జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ పద్దతుల ద్వారా మొత్తం 384 సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యం అధికారులు పెట్టుకున్నారు. అందులో హెచ్‌టీరిమ్స్ ద్వారా 234, ఏటీఎస్సీ పద్ధతి ద్వారా 150 ఏర్పాటుకు ప్రతిపాదించగా యూటర్న్, ఫ్లైఓవర్లు కారణంగా సైట్ అందుబాటులో లేకపోవడం వల్ల 50 సిగ్నల్స్‌ను తొలగించారు. మిగిలిన 334 సిగ్నల్స్‌లో హెచ్‌టీరిమ్స్ 212, ఏటీఎస్సీ 122 ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రసుతం 199 హెచ్‌టీరిమ్స్, 73 ఏటీఎస్సీ ద్వారా మొత్తం 179 సిగ్నల్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇంకా 44 సిగ్నల్స్ ప్రగతి దశలో ఉన్నాయి. మరో 18 లొకేషన్లను సంబంధిత శాఖల అధికారుల నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న సిగ్నల్ ఏర్పాట్లు పూర్తయితే హెచ్టీరిమ్స్ సిస్టమ్ ద్వారా 212 సిగ్నల్స్, ఏటీఎస్సీ సిస్టమ్ ద్వారా 122 నగరంలో మొత్తం 334 సిగ్నల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
సురక్షిత ప్రయాణం..
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సిగ్నల్స్ ద్వారా కారిడార్‌లోఉన్న సిగ్నల్స్‌ను కేంద్రీకృతంగా నియంత్రించడం, ట్రాఫిక్ అనుగుణంగా సిగ్నల్ టైమింగ్ మార్చుకునే వెసులుబాటుకు అవకాశముంటుంది. ట్రాఫిక్‌ను కెమెరాలో రికార్డు చేసే సెన్సార్ ఏర్పాటు చేస్తారు. పవర్ బ్యాక్‌అప్ కోసం సోలార్‌తో పాటు ప్రత్యేక బ్యాటరీ ఏర్పాటు చేయనున్నారు. సురక్షితమైన ప్రయాణంతో పాటు ఎక్కువ సమయం ప్రయాణికులు సిగ్నల్స్ వద్ద వేచిఉండకుండా ట్రాఫిక్ రద్దీని బట్టి సిగ్నల్స్ టైమింగ్ మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఈ నూతన సిగ్నల్స్ వ్యవస్థ తో రోడ్డు భద్రతకు పెద్దపీట వేయడంతో పాటు నగర ప్రజలకు సురక్షిత సులభమైన ప్రయాణాన్ని అందించేందుకు జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.