ఆయనో అటెండర్. చేసేది చిన్న ఉద్యోగమే అయినా.. ఆయనకు మాత్రం పెద్ద పేరే ఉంది. మూడు దశాబ్దాలుగా ఓ జాతీయ పార్టీకి అటెండర్ గా సేవలు అందించారు. ఆయన లేనిదే ఏ కార్యక్రమం జరగలేదంటే అతియోశక్తి కాదు. చిన్న స్థాయి గల్లీ లీడర్ నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు ఆయనంటే తెలియనివారు ఉండరు. ఆయన మరెవరో కాదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీభవన్ లో అటెండర్ షబ్బీర్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆయన చేత తన క్యాంపు ఆఫీసును ప్రారంభింపజేసుకున్నారు. దీన్ని బట్టే ఆయనకు ఎంత పేరు ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. కులం, మతం అనే తేడా లేకుండా అందరు నాయకులతో షబ్బీర్ కి మంచి అనుబంధం ఏర్పడింది. ఎంతోమంది కాంగ్రెస్ అగ్రనేతలైన పీసీసీ అధ్యక్షులకి, ముఖ్యమంత్రులకి, ఎంతోమంది మంత్రులకు ఎమ్మెల్యేలకు అంకిత భావంతో సేవలందించారు షబ్బీర్.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో సుదీర్ఘ కాలంగా అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ షబ్బీర్ కరోనాతో బుధవారం మరణించారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత మూడు దశాబ్దాల నుంచి మహ్మద్ షబ్బీర్ అటెండర్ గా గాంధీభవన్ లో సేవలందిస్తున్నారు. షబ్బీర్ అకాల మరణం పట్ల టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, కార్యాలయ సిబ్బంది సంతాపం తెలిపారు. గాంధీ భవన్ లో షబ్బీర్ చిత్ర పటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా షబ్బీర్ చేసిన సేవలను నేతలు కొనియాడారు.
గడిచిన 30 ఏళ్లల్లో పార్టీలోని అందరు నేతలతో షబ్బీర్ కి అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎందరో ముఖ్యమంత్రులను ఆయన దగ్గర ఉండి చూశారు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే అది షబ్బీర్ చేయాల్సిందే. షబ్బీర్ ను అటెండర్ లా కాకుండా ఓ కుటుంబ సభ్యుడిలా పార్టీ నేతలు భావించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గాంధీభవన్ కు వచ్చే కార్యకర్తలు, నాయకులకు కావాల్సినవన్నీ షబ్బీరే దగ్గరుండి చూసే వారు. గాంధీభవన్ కు వచ్చిన ఎందరో జాతీయ నాయుకులకు సైతం షబ్బీర్ తో పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి నేడు కరోనాకు బలైపోయవడంతో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
సీనియర్ అటెండర్ షబ్బీర్ ఆకస్మిక మఋతి తనను తీవ్రంగా బాధించిందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రిసిడెంట్ రేవంత్ రెడ్డి. తన పార్లమెంటు కార్యాలయాన్ని గాంధీభవన్ అటెండర్ అయిన షబ్బీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. షబ్బీర్ ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 2019 డిసెంబర్ 9న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అట్టహాసంగా మల్కాజిగిరి పార్లమెంటరీ కార్యాలయం ప్రారంభమైంది. అయితే,ఈ కార్యాలయాన్ని అటెండర్ షబ్బీర్ ప్రారంభించారు. షబ్బీర్‌తో కార్యాలయం ప్రారంభించి, వినూత్న సంప్రదాయానికి ఎంపీ రేవంత్ రెడ్డి తెరతీశారు. రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రారంభించే అవకాశం రావటం అదృష్టమని అటెండర్ షబ్బీర్ మురిసిపోయారు. సామాన్యుడైన షబ్బీర్ సేవలను గౌరవించిన ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ప్రశంసించారు.