Friday, November 22, 2024

Delhi | తెలంగాణ నుంచి బరిలోకి దిగండి.. సోనియాకి రేవంత్ బృందం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం రాత్రి గం. 7.00 తర్వాత ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం 10, జన్‌పథ్‌లో ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు. అంతకు ముందు ఈ ముగ్గురు నేతలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాహుల్ గాంధీ “భారత్ జోడో న్యాయ్ యాత్ర”లో పాల్గొన్న నేతలు తిరుగు ప్రయాణంలో రాంచీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సోనియా గాంధీ నివాసానికి చేరుకోగా.. ఆ సమయంలో సోనియ పార్లమెంటులో ఉన్నారు. సోనియా తన నివాసానికి తిరిగొచ్చిన తర్వాత ముగ్గురు నేతలు సమావేశమై సుమారు అరగంటపాటు ఆమెతో చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీల్లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.

అలాగే తాజాగా గ్యాస్ సిలిండర్ ధర, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల గురించి కూడా సోనియాకు తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం గురించి సోనియా గాంధీ ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పథకంపై మహిళల నుంచి స్పందన ఎలా ఉందని ఆమె అడిగినట్టు తెలిసింది. అలాగే ఇంకా అమలు చేయాల్సిన హామీల గురించి కూడా ఆమెతో నేతలు ముగ్గురూ చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సృష్టిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

- Advertisement -

మరోవైపు కేంద్ర పన్నుల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ విషయంపై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించాయి. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి.

ఈ వారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రులు, నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేరళను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఢిల్లీలో బుధవారం ధర్నా ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కలిసి నిరసన తెలిపడం గురించి ఆ పార్టీ అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తోంది.

ఆ క్రమంలో సోమవారం రేవంత్ రెడ్డి తనను కలిసినప్పుడు సోనియా గాంధీ ఈ అంశం గురించి చెప్పినట్టు సమాచారం. సోనియా గాంధీని కలిసిన వెంటనే తిరుగు ప్రయాణం కావాల్సిన రేవంత్ బృందం ఢిల్లీలోనే ఆగిపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్టయింది. సోనియాతో భేటీ ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దింపేసిన సీఎం రేవంత్ రెడ్డి, తన నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement