న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రముఖ సినీహీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాల నిర్మాతలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తరఫున ఆ సంస్థ సెక్రటరీ ఎం. వేణుగోపాల రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించింది. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పన్ను రాయితీలు ఇచ్చాయని, అయితే ఆ రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ రాయితీ సొమ్మును సినిమా యూనిట్ నుంచి రికవరీ చేయాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించాలని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ కేసులో మొత్తం 10 మందిని ప్రతివాదులుగా పేర్కొనగా, 10వ ప్రతివాదిగా సినీ హీరో నందమూరి బాలకృష్ణను చేర్చింది. ఇతర ప్రతివాదుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి, కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి, కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్‌తో పాటు సినీ నిర్మాణ సంస్థలు గున్నా టీమ్ వర్క్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన వై. రాజీవ్ రెడ్డి ఉన్నారు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా 2017లో విడుదల చేశారు. 2వ శతాబ్దానికి సంబంధించిన శాతవాహన సామ్రాజ్యాధినేత గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో ఈ సినిమాను రూపొందించినందున తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినిమా యూనిట్ కోరింది. ఈ సినిమాకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇచ్చాయి. అయితే ఆ మేరకు సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని చెబుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.