హైదరాబాద్, ఆంధ్రప్రభ: చుట్టూ జలసిరులు ఉన్నా చుక్కనీటికి నోచుకోని జోగులాంబ గద్వాల జిల్లా లోని గట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గత సమైక్యపాలకులు గట్టు ప్రజలను ఓటర్లుగానే చూశారే కానీ వారి బతుకులను తీర్చి దిద్దేందుకు చేసిన ప్రయత్నాలు శూన్యం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టులో జలాశయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారే కానీ ప్రాజెక్టు నిర్మాణం కోసం తట్టెడు మట్టి తీయలేదు, నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు సాధించలేక పోయారు. సమద్రమట్టానికి ఎత్తుప్రాంతంలో ఉన్న గట్టు చుట్టూ జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులున్నా నీటి చుక్క ప్రాజెక్టుల నుంచి వచ్చే అవకాశాలు లేవు, వర్షం నీటితో తడిసే నేలలో వ్యవసాయం చేసుకోవడం లేదా వలసలకు వెళ్లడం గట్టు ప్రజలకు అలవాటైన ప్రక్రియ.
తెలంగాణ ఉద్యమ గడియల్లో గట్టు ప్రజల కష్టాలను క్షేత్ర స్థాయిలో చూసి జలవనరులే సమస్యలకు పరిష్కారమని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గత కాంగ్రెస్ పాలకులు మొదలుపెట్టి సమస్యలను సృష్టించి నిలిపివేసిన ప్రాజెక్టుకు గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుగా నామకరణం చేసి 29 సెప్టెంబర్ 2018లో డిజైన్ మార్చి శంకు స్థాపన చేసి పనులు ప్రారంభించారు. అయితే పర్యావరణ అనుమతులు, కృష్ణా జలాలపై ఏపీ అభ్యంతరాలను అధిగమించి పనుల్లో వేగం పెంచారు. ర్యాలంపాడు జలాశయం నుంచి 2.80 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గట్టుఎత్తిపోతల పథకానికి సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 553కోట్ల 98 లక్షలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం అంచనావ్యయం రూ. 750 కోట్లకు చేరుకుంది.. ఈ పనులను 18 నెల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచింది.
తొలిదశలో రిజర్వాయర్ అప్రోచ్ కెనాల్, పంపుహౌస్, ప్రెజర్ లెంత్ పనులు జరుగుతున్నాయి. మొదట ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 3.2 కిలోమీటర్ల వరకు అప్రోచ్ కెనాల్‌ను నిర్మించారు. రెండవదశలో రూ. 100 కోట్లతో కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకం పూర్తి అయితే ధరూర్, గట్టు,కేడీ దొడ్డి, మల్దకల్ మండలాల్లోని మొట్ట ప్రాంతాలకు విరివిగా సాగునీరు అందనుంది. గట్టు రిజర్వార్ నిర్మాణానికి 935 ఎకరాల భూమి అవసరం కానుంది. అయితే ఈ భూముల్లో కేవలం 100 ఎకరాలు మాత్రమే రైతులు పట్టాభూములు కోల్పొతున్నారు.
భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం,పరిహారం చెల్లించే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. భూసేకరణ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పనుల్లో వేగం పెంచడంతో గట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు ధరూర్, కేడీ దొడ్డి, మల్దకల్ మండలాల్లోని మొట్ట ప్రాంతాలైన 21 గ్రామాల్లోని 33వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే 41 చెరువులను నింపి వ్యవసాయానికి నీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచి 2024నాటికి పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ కృషి చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో 28వేల ఎకరాలకు సాగునీరు, 5వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది.
తెలంగాణ సస్యశ్యామలం..
60 ఏళ్ల వివక్షనుంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం దేశానికి తిండి పెట్టే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకువస్తున్నారని గద్వాల శాసనసభ్యుడు కృష్ణ మోహన్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాలతో పాలమూరు ప్రజలు వలసలకు వెళ్లడంలేదని ఆయన తెలిపారు. పాలమూరుకే ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారన్నారు.తెెలంగాణ ఆవిర్భవించగానే సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధన్యత ఇవ్వడంతో సమైక్యపాలనలో దండుగైన వ్యవసాయం ప్రస్తుతం పండుగైందన్నారు. గట్టు ఎత్తిపోతల తో నడిగడ్డలో జలసవ్వళ్లు చేయనున్నాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులతో భూముల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. కళ్ల ముందు జరుగుతున్న ఆభివృద్ధిని ఎవరూ కాదనలేరన్నారు.