అమరావతి, ఆంధ్రప్రభ:దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) – 2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు(ఐఐఎస్‌ఈ) విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో, రెండు షిప్టnుల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష షెడ్యూలులో మారే అవకాశం ఉంది. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30గా ఉండనుంది.
పరీక్షా కేంద్రాలు..
ఏపీలో చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.