Thursday, November 21, 2024

సామాన్యుడికి గ్యాస్‌ మంట, పెరిగిన సిలిండర్‌ ధర.. 50 వడ్డించిన చమురు సంస్థలు

సామాన్య మానవుడు కడుపు నిండా మూడు పూటలు తినలేని పరిస్థితి దేశంలో నెలకొంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు గ్యాస్‌ బండ తోడైంది. శనివారం ఉదయాన్నే.. చమురు సంస్థలు బాంబు పేల్చాయి. నిరుపేదకు ఇది బ్యాడ్‌ న్యూస్‌.. గృహ వినియోగ గ్యాస్‌ 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో ఢిల్లిలో సిలిండర్‌ ధర రూ.999.50కు చేరుకుంది. హైదరాబాద్‌లో రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్‌ తీసుకునే రూ.30 చార్జీ అదనం. బండ ఇంట్లోకొచ్చి పడాలంటే.. రూ.1082 చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర కొన్ని రోజుల క్రితమే పెంచాయి. 1వ తేదీన రూ.102.50 మేర పెంచడంతో.. ఢిల్లిలో కమర్షియల్‌ గ్యాస్‌ ధర ఏకంగా రూ.2,253కు చేరుకుంది. హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.2460 నుంచి రూ.2,563.50కు చేరుకుంది.

ఇప్పటికే నిత్యావసర ధరలతో..

దేశంలో ఇప్పటికే ఇంధన ధరలు పెరగడంతో.. సామాన్య మానవుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ తరుణంలో గ్యాస్‌ ధర మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరల మోతతో వంట గ్యాస్‌ సిలిండర్‌ సామాన్యులు మోయలేనంత బరువెక్కుతోంది. దీంతో వంటలు చేసుకునేందుకు కట్టెల పొయ్యే దిక్కు అవుతున్నది. ఇప్పటికే నిత్యావసరాలతో పాటు నూనె ధరలు భగ్గుమంటున్నాయి. గత నెలలోనే పైప్‌డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. రూ.4.25 పెరగడంతో.. ఎస్‌సీఎం రూ.45.86కు చేరుకుంది. ముడి సరుకు ధరలు విపరీతంగా పెరగడంతోనే.. సహజ వాయువు ధరలు పెంచినట్టు సదరు కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరల విషయంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పెట్రోల్‌, డీజెల్‌, జెట్‌ ఫ్యూయెల్‌, సహజ వాయువుతో పాటు గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ పెరుగుదలకు కారణం అవుతున్నాయి.
నిరుపేదలకు ఉచితంగా కనెక్షన్ మే 1న చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఉజల దివస్‌ సందర్భంగా 5000 కంటే ఎక్కువ ఎల్‌పీజీ పంచాయత్‌లను నిర్వహించాయి. ఇక్కడ వినియోగదారుల అనుభవాలను తెలుసుకున్నాయి. అదేవిధంగా ఎల్‌పీజీ సిలిండర్ల వాడకం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాయి. అదేవిధంగా వినియోగదారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశాయి. ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రధానమంత్రి ఉజల యోజన (పీఎంయూవై) పథకం ద్వారా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందజేస్తున్నది. 2016, మే 1న ప్రధాన నరేంద్ర మోడీ ఈ స్కీంను ఉత్తర్‌ప్రదేశ్లోని బల్లియాలో ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement