ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈరోజు ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిపడ్డారు.
నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజికవర్గానికి టీడీపీలో గౌరవం లేదని విమర్శించారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.